ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ‘డాన్ 3’ చిత్రం గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంది. ఈ సినిమా నుంచి రణవీర్‌సింగ్ వైదొలగడం, ఆ కారణం చేత తన సంస్థకు 45కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేయడం, రణవీర్‌పై నిషేదం విధించినట్టు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ప్రకటన చేయడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ నాటకీయ పరిణామాల మధ్య అసలు ‘డాన్ 3’ ఉంటుందా? అనే అనుమానాలు కూడా బాలీవుడ్లో వ్యక్తమయ్యాయి.
అయితే.. తాజా సమాచారం ప్రకారం ‘డాన్ 3’ కోసం షారుక్‌ఖాన్‌ని కలిశారట దర్శక,నిర్మాత ఫర్హాన్ అక్తర్. డాన్, డాన్ 2 చిత్రాల కథానాయకుడైన షారుక్.. కథ నచ్చకపోవడం వల్లే ‘డాన్ 3’ని తిరస్కరించారని గతంలో వార్తలొచ్చాయి. ఈ కారణం వల్లే ఈ ప్రాజెక్ట్ రణవీర్ చెంతకు చేరిందనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే.. ఇప్పుడు మళ్ల్లీ షారుక్ దగ్గరకే ఫర్హాన్ వెళ్లడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
అయితే.. ఓ కండీషన్ మీదైతే ‘డాన్ 3’లో తాను నటిస్తానని ఫర్హాన్ అక్తర్‌తో అన్నారట షారుక్. ఇంతకీ షారుక్ కండీషన్ ఏంటా?! అనుకుంటున్నారా? తనకు ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన అట్లీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే ‘డాన్ 3’ చేయడానికి సిద్ధం అన్నారట షారుక్. ఇక తుది నిర్ణయం ఫర్హాన్ అక్తర్‌దే. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కీలకం. ఆ పాత్ర కోసం ఇప్పటికే విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండలను ఫర్హాన్ అక్తర్ కలిశారని బాలీవుడ్లో టాక్ నడుస్తున్నది. మరి ఫర్హాన్ అక్తర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.