Project-K Movie | ఒక దశాబ్దం కిందట తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసిందంటే ఆహో ఓహో అనుకునే వాళ్లం. ఆ తర్వాత ఈ నెంబర్ కాస్త రెండింతలైంది. ఇక బాహుబలితో రాజమౌళి అక్షరాల 500కోట్ల ఫిగర్‌ను చూపించాడు. దీన్ని కొట్టే సినిమా మళ్లీ బాహుబలి-2 అవుతుంది తప్ప మరో సినిమా కాదు అనుకున్నాం. అనుకున్నట్లుగానే బాహుబలి-2 ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు రెట్ల కలెక్షన్లు కొల్లగొట్టి తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ బాహుబలి-2 కలెక్షన్లను ఈజీగా కొల్లగొడుతుందని అందరూ భావించారు.
కానీ అది జరుగలేదు. అదీ కాకుండా దాని దరిదాపుల్లోకి కూడా ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్ సైతం ఇప్పటివరకు ఈ సినిమాను రికార్డును కొట్టలేకపోయింది. అయితే దంగల్ బాహుబలి-2ని మించి కలెక్ట్ చేసింది కానీ.. మన దేశంతో పోల్చితే పక్క దేశాల్లో దంగల్‌కు బాగా రీచ్ వచ్చింది. దాంతో ఇప్పటికీ ఇండియాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి-2 మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఆ కలెక్షన్లు బీట్ చేసే దమ్ము ప్రాజెక్ట్-K సినిమాకు ఉందని అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. అంతేకాకుండా ఈ సినిమా తొలిరోజే 500కోట్లు కలెక్షన్లను సాధిస్తుందని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా వెల్లడించాడు.
ఇటీవల రెండు సార్లు తాను ‘ప్రాజెక్ట్ K’ సెట్స్‌కి వెళ్లానని.. వాళ్తు తీస్తున్న విధానం బాగుందని, సరైన పద్ధతిలో ప్రచారం చేస్తే ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో టాప్-50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని తమ్మారెడ్డి తెలిపాడు. అది వైజయంతీ మూవీస్ ప్రచార కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. సరైన పద్ధతిలో ప్రమోట్ చేస్తే తొలి రోజు ఈ సినిమా రూ.500 నుంచి రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని, అయితే అది వైజయంతీ మూవీస్ ప్రచార కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుందని ఆయన అన్నాడు. సినిమా బాగుంటే కచ్చితంగా హాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K సినిమాపై ప్రేక్షకుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ ఇలా స్టార్ కాస్టింగ్ ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా.. బ్యాలెన్స్ వర్క్ చాలా ఉండటంతో సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటకి ఇలాంటి సినిమా కోసం ఎంత కాలమైన ఆగొచ్చు. అందరు చెబుతున్న బట్టి దాన్ని చూస్తే ఈ సినిమాను ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన హాలీవుడ్ సినిమాల కలెక్షన్లను తలదన్నే రీతిలో కోట్లు కొల్లగొడుతుందనడంలో అతిశయోక్తి లేదు.