రోహిణి అంటే.. ‘జబర్దస్త్ రోహిణి, ‘సేవ్ ద టైగర్స్’ రోహిణి, త్వరలోనే ‘హనుమాన్’ రోహిణి కూడా! అమ్మాయిలకూ కామెడీ టైమింగ్ ఉంటుందని, పటాకుల్లాంటి పంచ్‌లు పేలుస్తారని నిరూపించింది తను. ‘తర్వాత ఏంటి?’ అనడిగితే చాలా విషయాలే చెప్పింది.
జబర్దస్త్‌తో నా కెరీర్ మలుపు తిరిగింది. జనాన్ని నవ్వించడంలో ఓ కిక్ ఉంటుంది. ఎదుటి మనిషిని ఏడిపించడం సులభమే. కానీ నవ్వించడం కష్టం. పగలబడి నవ్వించడం మరీ మరీ కష్టం. ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యాను. కాబట్టే, కొత్తకొత్త ఆఫర్స్ వస్తున్నాయి. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ నుంచీ పిలుపు వచ్చింది. సినిమాకు దీటుగా ఎదుగుతున్న మీడియా వెబ్ సిరీస్. మనల్ని మనం నిరూ పించుకోడానికి ఇదో అవకాశం కూడా. ప్రస్తుతం ‘సేవ్ ద టైగర్స్’ రెండో భాగం కూడా సిద్ధం అవుతున్నది. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఆ పని మీదే ఉన్నాను. ఇక, సోషల్ మీడియా అంటారా? నేరుగా జనానికి కనెక్ట్ కావడానికి అంతకుమించిన వేదిక లేదు. అందుకే, సామాజిక మాధ్యమాల్ని వీడకుండా, టీవీ షోలను వదిలిపెట్టకుండా, వెబ్‌సిరీస్‌లో కనిపిస్తూ.. నాదైన కెరీర్ నిర్మించుకుంటున్నా.
మాది వైజాగ్ దగ్గర్లోని ముసిడిపల్లి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదువుకున్నా. విజయవాడలో బీటెక్ చేశాను. క్యాంపస్ ప్లేస్మెంట్ రావడంతో హైదరాబాద్‌లో వాలిపోయాను. ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకోడానికి ఓ కోచింగ్ సెంటర్లో చేరాను. అక్కడే, ఓ సర్ నన్ను నటన వైపు ప్రోత్సహించారు. దీంతో ఓ ఆరునెలలు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. ఆ జర్నీలో చిన్నపాటి చేదు అనుభవాలూ ఉన్నాయి. ఓ దశలో వెనక్కి వెళ్లిపోవాలని అనుకున్నాను. ఇంట్లో కూడా అభ్యంతరం చెప్పారు. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ, బ్యాంక్ జాబ్ కానీ తెచ్చుకోమని సర్దిచెప్పారు. అంతలోనే నాకు నేను ధైర్యం చెప్పుకొన్నాను. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్లో నా పాత్ర హిట్ కావడంతో.. మా వాళ్లు కూడా సంతోషించారు. చిన్నప్పటి నుంచీ అంతే నవ్వడం, నవ్వించడం నాకు ఇష్టం. అలీ గారిని, కోవై సరళగారిని ఇమిటేట్ చేసేదాన్ని. నేను ఉన్నానంటే.. చుట్టుపక్కల సందడే సందడి.
ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు ‘ఆహా’ ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తున్నా, జీ తెలుగులో ఫ్యామిలీ నంబర్‌వన్ పూర్తయింది. ‘హనుమాన్’ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నా. విజయ్ దేవరకొండ చిత్రంలోనూ నటిస్తున్నా. అన్నీ నా అభిరుచికి తగిన పాత్రలే. అందులోనూ పనిమనిషి క్యారెక్టర్లే ఎక్కువ. అన్నిరకాల పాత్రలూ చేయాలని నా ఆలోచన. ఎక్కడికెళ్లినా జనం గుర్తుపడుతున్నారు. పలకరిస్తున్నారు. సెల్ఫీలు అడుగుతున్నారు. శ్రీదేవి అనే అభిమాని తాను దాచుకున్న డబ్బుతో ఓ వాచీ కానుకగా పంపింది. జీవితంలో ఎప్పుడూ ఫలానా తప్పు చేశాననే పశ్చాత్తాపం ఉండకూడదు. రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టాలి. ఇదే నా ఫిలాసఫీ. ఇప్పటిదాకా సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉంది. అలా అని ఇక్కడితో ఆగిపోవాలని లేదు. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా. రవితేజ గారితో మంచి కామెడీ సినిమాలో చేయాలని ఉంది. చూద్దాం!