సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాయోన్’. ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకు సిద్ధమవుతున్నది. నిర్మాత మామిడాల శ్రీనివాస్ తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ..‘నన్ను ఆదరించినట్లే నా కొడుకు సిబిరాజ్ను తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. కొత్తదనం ఉన్న సినిమా ఇది. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ..‘పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధన నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. దేవుడికి, శాస్ర్తానికి మధ్య నడిచే సంఘర్షణను ఈ చిత్రంలో చూస్తారు. ఇళయరాజా సంగీతం మరో ఆకర్షణ అవుతుంది.అన్నారు’ ‘నేను తెలుగు తెరపైకి వస్తున్న తొలి చిత్రమిది. ఇందులో ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించాను’ అన్నారు సిబిరాజ్. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.