బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించి దేశ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు సత్యరాజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సత్యరాజ్ ఇటీవల ఆయన తనయుడిని కూడా హీరోగా పరిచయం చేశారు. శిబి సత్యరాజ్ హీరోగా ‘మాయోన్’ అనే సినిమా రూపొందుతుంది. కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం.
తాజాగా సత్యరాజ్ ఇంట్లో ఓ విషాదం జరిగింది. సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్ కన్నుమూశారు. తమిళనాడులోని తిరుప్పుర్ జిల్లా కంగేయంలో నివసించే కల్పన ఆరోగ్యం వారం రోజుల నుండి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే ఆమెను కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 66 ఏళ్ల కల్పన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆవిడ శనివారం ప్రాణాలు విడిచారు. ఆమె మృతితో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.