Samyuktha Menon | ‘భీమ్లా నాయక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నాయిక సంయుక్త మీనన్. ‘బింబిసార’, ‘సార్’ వంటి విజయాలతో ఆమె టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త నటించిన కొత్త సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపింది సంయుక్త మీనన్.
మిస్టిక్ థ్రిల్లర్ చిత్రమిది. హారర్ ఎలిమెంట్స్ ఉండవు. కానీ థ్రిల్లర్ అంశాలే కొద్దిగా భయపెడతాయి. ఈ సినిమా రుద్రవనం అనే ఒక కాల్పనిక ఊరిలో జరుగుతుంది. కొండల మధ్య ఉన్న ఆ గ్రామంలో ఉండే అమ్మాయి నందిని పాత్రలో కనిపిస్తాను. ఆమెకు ఆత్మవిశ్వాసం, పొగరు ఎక్కువ. మాటలో, ప్రవర్తనలో ఆధిపత్యం చూపిస్తుంది. ఆ ఊరికి సూర్య (సాయిధరమ్ తేజ్) వస్తాడు. అతని మాటలను నందిని పట్టించుకోదు. ఇది మా ఊరు. మా ఊరి గురించి మాకు తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తుంది. నేను ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు కొంచెం వినయంగా ఉన్నా, దర్శకుడు అలా వద్దు పొగరుగానే కనిపించాలని చెప్పేవారు. ఈ పాత్రకు, వ్యక్తిగతంగా నా స్వభావానికి ఎలాంటి పోలిక లేదు.
ఇలాంటి సినిమాల మేకింగ్‌కు బాగా టైమ్ తీసుకోవాలి. దర్శకుడు కార్తీక్ అయితే ఇప్పటికీ ఇంకొక నెల టైమ్ ఇస్తే బాగుండు అంటుంటారు. నేను తెలుగులో ఒప్పుకున్న తొలి సినిమా బింబిసార. ఆ తర్వాత విరూపాక్ష. ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. నాకు ఒక్క ముక్క తెలుగు రాదు. నా ఇంట్రడక్షన్ సీన్ కోసం 60 నుంచి 70 పేజీల డైలాగ్స్ ఇచ్చారు. ఆ పేపర్స్ చూసి వణికిపోయాను. భాష రాకుండా ఎలా నటించగలను అనిపించింది. ఏదో ప్రాప్టింగ్ చెబితే సరిపోదు ఆ పాత్రలా మారిపోయి అభినయించాలి. భాష తెలిస్తేనే అది సాధ్యం. సెకండ్ వేవ్ సమయంలో తెలుగు ట్యూటర్‌ను పెట్టుకుని భాష నేర్చుకోవడం మొదలుపెట్టాను.
అదృష్టవశాత్తూ ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత దక్కింది. ప్రతి క్యారెక్టర్ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. ఇలా అన్ని పాత్రలు కీలకంగా ఉండే స్క్రిప్ట్ కుదరడం అరుదు. ఒక్కో సీన్లో ఆరేడుగురు నటీనటులు ఉంటారు. యాంకర్ సుమ కూడా మంచి క్యారెక్టర్లో కనిపిస్తుంది.
అతను మంచి కోస్టార్. యాక్సిడెంట్ ముందు, తర్వాత సాయిలో చాలా మార్పు చూశాను. జీవితంలో ఒక ప్రమాదం జరిగిన తర్వాత దాని నుంచి కోలుకుని మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం అంత సులువు కాదు. సాయితేజ్ ఈ విషయంలో ఎంతో కష్టపడ్డాడు. సూర్యగా అతని పర్మార్మెన్స్ ఆకట్టుకుంటుంది.
ఇప్పటిదాకా నన్ను ప్రేక్షకులు సంప్రదాయంగా కనిపించే ఒక అమ్మాయి క్యారెక్టర్స్‌లో ఆదరించారు. వారు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలనే ఎంచుకుంటాను. కొన్ని ప్రాజెక్టులకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా.