Maatrubhumi | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘మాతృభూమి’ ఎట్టకేలకు ప్రభుత్వ క్లియరెన్స్ పొందింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ వార్ డ్రామా రూపుదిద్దుకుంది. ముందుగా ఈ చిత్రానికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్ ఖరారు చేసినప్పటికీ, ఆ తర్వాత ‘మాతృభూమి’గా మార్చారు. భారత్-చైనా సంబంధాల మెరుగుదల నేపథ్యంలో చైనాను చిత్రంలో చూపించిన విధానంపై రక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమాలో కొన్ని మార్పులు చేసి సవరించిన వెర్షన్‌ను అందజేశారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) గత వారమే ఈ చిత్రానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది.
ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ తంతు త్వరగా ముగిస్తే నవంబర్ 13న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత ప్రేక్షకులు సెలవు వాతావరణంలో ఉంటారు కాబట్టి, నవంబర్ 13న విడుదల చేయడం సరైన సమయమని సల్మాన్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. త్వరలోనే విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్రంగదా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నయనతారతో కలిసి మరో కొత్త ప్రాజెక్ట్ (SVC63) లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.