సాయిపల్లవి అంటే అభినయప్రధాన, భావోద్వేగభరిత పాత్రలకు పెట్టింది పేరు. ఎక్కడా నాటకీయత కనిపించకుండా సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంటుందీ భామ. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో మెప్పించిన ఈ తమిళ సోయగం తన పంథాకు భిన్నంగా పవర్ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నదట. తొలిసారి ఖాకీ డ్రెస్‌లో లేడీసింగంగా హల్చల్ చేయడానికి సిద్ధమవుతున్నదట. వివరాల్లోకి వెళితే.. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందని తెలిసింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ ప్రధానంగా ఆమె పాత్రను డిజైన్ చేశారట. హీరోతో సమానంగా సాయిపల్లవి పోరాట ఘట్టాల్లో భాగమవుతుందని, కెరీర్లోనే ఆమెకిది పూర్తి వైవిధ్యమైన క్యారెక్టర్ అని చెబుతున్నారు. ఈ సరికొత్త యాక్షన్ మోడ్‌లో సాయిపల్లవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందోనని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.