Roja | సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సినీ రంగం, రాజకీయ రంగం రెండింటిలోనూ తనదైన ముద్ర వేసిన రోజా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కుటుంబానికి సంబంధించిన మధుర క్షణాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడం రోజాకు అలవాటే. ముఖ్యంగా ఆమె కుమార్తె అన్షుమాలికకు సంబంధించిన పోస్టులు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా రోజా తన కుమారుడు కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట ఆకర్షణగా మారాయి.
రోజా, దర్శకుడు ఆర్.కే. సెల్వమణి దంపతులకు అన్షుమాలిక, కౌశిక్ అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. కౌశిక్ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆత్మీయంగా నిర్వహించారు. ఇంట్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో రోజా, సెల్వమణి, అన్షుమాలిక, కౌశిక్ కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ కుమారుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తన కొడుకుపై ఉన్న ప్రేమను, ఆప్యాయతను తెలియజేస్తూ భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.
నువ్వు ఈ రోజు ఉన్న వ్యక్తిగా ఎదగడాన్ని చూడటం నా జీవితంలో అత్యంత గొప్ప ఆనందం. దేవుడు నీకు ఆరోగ్యం, ఆనందం, విజయం, అపారమైన అవకాశాలను ప్రసాదించాలి. ఎప్పుడూ వినమ్రత, దయ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నీ వయసు ఎంత పెరిగినా నువ్వు ఎప్పటికీ నా చిన్నారి బాబువే. ప్రేమ, నవ్వులు, మరపురాని క్షణాలతో నిండిన సంవత్సరం నీకు లభించాలని కోరుకుంటున్నాను అంటూ రోజా తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజా అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కౌశిక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే తన కుమార్తె అన్షుమాలిక సాధించిన విజయాలను, కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చిన రోజా, తాజాగా కుమారుడి పుట్టినరోజును కూడా సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది.