Review: Epic First Semester | ‘బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సినిమా కావడం, ‘#90s’ వెబ్ సిరీస్‌తో బుల్లితెరపై హిట్ కొట్టిన ఆదిత్య హాసన్ వెండితెరపై అడుగు పెట్టడం, వరుస విజయాలు అందుకుంటున్న నాగవంశీ నిర్మాణంలో రావడం.. ఇలా అంతా సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మంచి క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. మరి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? బేబీ జోడీ మరో హిట్ కొట్టిందా? రివ్యూలో చూద్దాం.
కథ:
ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) వనపర్తిలో డిగ్రీ పూర్తి చేసి సినిమా దర్శకుడు కావాలని షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటాడు. సినీ పరిశ్రమ అంటేనే రిస్క్ అని భావించిన తండ్రి చంద్రశేఖర్ (శివాజీ) ఆదిత్యని చదువుల కోసం లండన్ పంపిస్తాడు. అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ ఎటు దారి తీసింది? ఆదిత్య డైరెక్టర్ అయ్యాడా? ఆదిత్య, కడలి పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
‘#90s’ యూనివర్స్‌కు కొనసాగింపుగా అందులో చిన్న కొడుకు పాత్ర చుట్టూ ఈ కథని రూపొందించాడు దర్శకుడు ఆదిత్య. నిజానికి చాలా మంచి ఆలోచన ఇది. 90s కుర్రాళ్ల ఎమోషన్స్, కెరీర్, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి విషయంలో వారి ఆలోచనలకు అద్దం పట్టేలా ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని మలయాళం సినిమాల్లో చెప్పుకోవడానికి పెద్ద కథ ఉండదు కానీ సన్నివేశాల్లో మ్యాజిక్ ఉంటుంది. దర్శకుడు ఆదిత్య ఈ సినిమా కోసం అదే దారిని అనుసరించాడు. ఇందులో చెప్పడానికి పెద్ద సంఘర్షణ ఉండదు కానీ తెరపై వచ్చే సన్నివేశాలు మాత్రం కాలక్షేపాన్ని ఇస్తాయి.
ఆదిత్య షార్ట్ ఫిలిమ్స్, స్నేహితులు, ఫ్యామిలీ మూమెంట్స్‌తో కథ చాలా కూల్‌గా మొదలవుతుంది. లండన్‌కి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రేమకథలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఆసక్తి కలిగిస్తుంది. ఈ ప్రేమకథ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ఈ ప్రేమకథలో సమాజంలోని కులాల పట్టింపులను కూడా ప్రస్తావించారు. కానీ అది సెన్సార్ కావడంతో అందులోని ఎమోషన్ ఆడియన్స్‌కి సరిగ్గా రిజిస్టర్ అవ్వదు.
సెకండ్ హాఫ్‌లో ప్రేమకథ మెల్లమెల్లగా బాధ్యతలు, కెరీర్ భయాల చుట్టూ నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే భావోద్వేగాల్లో నిజాయితీ కనిపిస్తుంది. ఈ కథని హీరోయిక్‌గా చెప్పొచ్చు కానీ దర్శకుడు రియాలిటీ చెక్కి ప్రాధాన్యత ఇచ్చాడు. నిజ జీవితంలో కెరీర్, ప్రేమ, పెళ్లి లాంటి నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో ఈ ప్రేమకథతో చూపించే ప్రయత్నం బావుంది. కాకపోతే ఇది ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే. కథని సగంలోనే ఉంచారు. దీంతో అసంపూర్ణమైన కథని చూశామా అనే ఫీలింగ్ సహజంగానే కలుగుతుంది.
నటీనటుల నటన:
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ చూడముచ్చటగా ఉంది. ఆనంద్ దేవరకొండ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్రలో అమాయకత్వం, భయం, కెరీర్ పట్ల ఉన్న బాధ్యత, ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ చక్కగా పలికించాడు. వైష్ణవి మోడ్రన్ అమ్మాయిలా కనిపించింది. తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. శివాజీ, వాసుకి పాత్రల్లో ఎమోషన్ వర్క్అవుట్ అయ్యింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఓ పాత్రలో నవ్వించాడు.
టెక్నికల్‌గా:
హెషామ్ పాటలు, నేపథ్య సంగీతం ఫీల్‌గుడ్ వైబ్ క్రియేట్ చేశాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. లండన్ విజువల్స్ ప్రేమకథకి కలర్‌ఫుల్ టోన్ యాడ్ చేశాయి. దర్శకుడు కథ కంటే సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టాడు. తను రాసిన డైలాగ్స్ కూడా క్యాచీగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
ఆనంద్, వైష్ణవి జోడీ
యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
అసంపూర్ణంగా అనిపించే కథ
కొన్ని సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2.75/5