నటీనటులు – రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, రావు రమేష్, ముకేష్ రుషి, వెన్నెల కిషోర్, సచిన్ కేద్కర్, ఠాకూర్ అనూప్ సింగ్, నికితిన్ ధీర్, ఉన్ని ముకుందన్, అనసూయ, మురళీ శర్మ తదితరులు
సాంకేతిక నిపుణులు
సంగీతం – దేవిశ్రీప్రసాద్
ఎడిటర్ – అమర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ – సుజిత్ వాసుదేవ్, జి కె విష్ణు
బ్యానర్స్ – ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
నిర్మాత – కోనేరు సత్యనారాయణ
రచన, దర్శకత్వం – రమేష్ వర్మ
థర్డ్ వేవ్ తర్వాత ఖిలాడి సినిమాతో భారీ థియేటర్ రిలీజ్ కు వచ్చారు అగ్ర హీరో రవితేజ. క్రాక్ సూపర్ హిట్ తర్వాత ఆయన నటించిన సినిమా కావడం.. దర్శకుడు రమేష్ వర్మ గత సినిమా రాక్షసుడు విజయం సాధించడం ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అన్ని వాణిజ్య అంశాలు చేర్చిన యాక్షన్ థ్రిల్లర్ కథతో ఖిలాడి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా మీద పెట్టుకున్న అంచనాలను ఖిలాడి నిలబెట్టుకుందా లేదా సమీక్షలో చూద్దాం.
భార్యను హత్య చేసిన నేరంపై జైలు శిక్ష అనుభవిస్తుంటాడు మోహన్ గాంధీ (రవితేజ). సైకాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షి చౌదరి) తన థీసిస్ కోసం మోహన్ గాంధీని కలవాలని అనుకుంటుంది. అతని మానసిక స్థితిని తెలుసుకోవాలన్నది ఆమె ఆలోచన. జైలుకు వచ్చిన పూజతో తను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానంటూ గతం చెబుతాడు మోహన్ గాంధీ. ఈ గతంలో మోహన్ గాంధీ అనాధ. అతన్ని చేరదీసి కొడుకులా చూసుకుంటాడు రాజశేఖర్ (రావు రమేష్). మోహన్ గాంధీ ఎదురింటి ఫ్లాట్ లో చంద్రకళ (అనసూయ), పుట్టపర్తి (మురళీ శర్మ) తో కలిసి వాళ్ల కూతురు చిత్ర (డింపుల్ హయతి) అద్దెకు ఉంటుంది.
డింపుల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మోహన్ గాంధీ. వాళ్లకో కూతురు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం నాయకుడు గురు సింగమ్ (ముకేష్ రుషి) ఎమ్మెల్యేలకు పంచుదామని ప్లాన్ చేసిన పదివేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో రాజశేఖర్ ను సీబీఐ అరెస్టు చేస్తుంది. దీంతో మోహన్ గాంధీ జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ఆ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ తో చెప్పించమని గురు సింగమ్ అతని కొడుకు బాలసింగం (నికితిన్ ధీర్), డేవిడ్ (ఠాకూర్ అనూప్ సింగ్) మోహన్ గాంధీని బెదిరిస్తుంటారు. అతని కుటుంబాన్ని చంపడానికి సిద్ధమవుతారు. మరోవైపు సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ ఈ కేసును పక్కాగా విచారణ చేస్తుంటాడు. ఇదంతా జైలులో ఉన్న మోహన్ గాంధీ పూజకు వివరిస్తాడు. నిజంగానే మోహన్ గాంధీ తన భార్యను చంపాడా. ఆ హత్య చేసిందెవరు, ఈ గతంలో రామకృష్ణ (ఉన్ని ముకుందన్) ఎవరు, పదివేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నుంచి రాజశేఖర్, మోహన్ గాంధీ ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ.
రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఆయన ఎనర్జీని చూపించగలిగే అంశాలన్నీ కథలో ఉన్నాయి. తొలి భాగంలో నాయికతో కలిసి సరదా సన్నివేశాలు, రొమాన్స్, పాటలు, కామెడీ సీన్స్ ఉండగా..ద్వితీయార్థంలో యాక్షన్ సన్నివేశాలు, భారీ ఛేజింగ్ లు పెట్టారు. వీటన్నింటిలో రవితేజ ఉత్సాహంగా నటించారు. నాయికలు డింపుల్ హయతి పాత్ర రెండు ఛాయల్లో ఉంది. మొదటి పాత్ర అమాయకంగా. రెండోది ఇంటెన్స్ గా ఉంటుంది. రెండు క్యారెక్టర్ కూ సరిపోయిందీ తార. ఈ చిత్రానికి ఆమెనే నాయికగా ఎందుకు తీసుకున్నారో సెకండాఫ్ లో తెలుస్తుంది. మరో నాయిక మీనాక్షి చౌదరికి కథలో కీలకమైన క్యారెక్టర్ దొరికింది. గ్లామర్ గా కనిపించడంలో ఈ ఇద్దరు నాయికలూ పోటీ పడ్డారు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు కూడా రెండు షేడ్స్ తో సాగుతాయి. తొలి భాగంలో మురళీ శర్మ ప్రకృతి ఆహారం తీసుకునే పాత్రలో నవ్వించారు. సీబీఐ అధికారి పాత్రలో అర్జున్ సెటిల్డ్ పర్మార్మెన్స్ కనబర్చారు. అర్జున్ దగ్గరకు వెళ్లి రవితేజ స్వయంగా అరెస్ట్ అయ్యే సీన్ హిలేరియస్ గా పండింది.
కథను రెండు కోణాల్లో చెప్పి ఆకట్టుకున్న థ్రిల్లర్ మూవీస్ గతంలో వచ్చాయి. ఖిలాడి కూడా అలాంటిదే. ప్రేక్షకులు కథను అంచనా వేయకుండా చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ కూడా ఇదే దారిని ఎంచుకున్నాడు. ఇంటర్వెల్ దాకా తెలిసిన కథకు ద్వితీయార్థం కథకు అస్సలు పోలిక ఉండదు. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులు పెట్టారు దర్శకుడు. ప్రథమార్థం ముగిసి సెకండాఫ్ కు లీడ్ ఇచ్చేదాకా ఈ ట్విస్ట్ బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడేం జరుగుతుందో అనే ఉత్సుకత సినిమా చూస్తున్న వారిలో కలిగింది. సినిమాను భారీతనంతో స్టైలిష్ గా రూపొందించడంలో రమేష్ వర్మ సక్సెస్ అయ్యారు. ఇటలీలో బైక్ ఛేజింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
ప్రథమార్థాన్ని ఒక ధారలో తీసుకెళ్లిన దర్శకుడు రమేష్ వర్మ ఇంటర్వెల్ వచ్చేసిరికి పూర్తి భిన్నమైన దారిలో కథను మలిపాడు. ఈ కొత్తదారి కంటే ముందు వెళ్తున్న కథే బాగుందనే అనుభూతి కలుగుతుంది. సెకండాఫ్ లో కథలో మలుపులు ఎక్కువయ్యాయి. దాంతో ఏది నిజమో ఆ సన్నివేశం పూర్తయ్యేదాకా తెలియకుండా అయ్యింది. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ లో ఏమాత్రం రాజీపడలేదు. క్వాలిటీగా సినిమాను నిర్మించారు. పాటల్లో అట్టా సూడకే, ఫుల్ కిక్కు పాటలు కలర్ ఫుల్ గా ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్, సుజిత్ వాసుదేవ్, జి కె విష్ణు సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా బలాన్నిచ్చాయి.
రవితేజ నటన
తొలి భాగం
యాక్షన్ సీన్స్
రెండు పాటలు
ద్వితీయార్థం
ఎక్కువైన మలుపులు
చివరగా ..మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా తెరకెక్కిన చిత్రమిది. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఖిలాడి ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.75/5