ప్రస్తుతం భారతీయ సినిమాలో భాషాపరమైన అంతరాలు చెరిగిపోతున్నాయి. జనరంజకమైన కథలు అన్ని భాషల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. దాంతో పాన్ ఇండియా మూవీ ట్రెండ్ ఊపందుకుంటున్నది. ఈ విషయం గురించి రానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి దక్షిణాది సినిమాల్ని నాలుగు భాషల్లో విడుదల చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందన్నారు.
అప్పుడు ప్రాంతీయ చిత్రాలనే ముద్ర చెరిగిపోయి దక్షిణాది సినిమాకు ఓ ప్రత్యేకత వస్తుందని పేర్కొన్నారు. ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన ‘కబ్జా’ మూవీ ట్రైలర్ను బెంగళూరులో ఆవిష్కరించిన ఆయన ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటిస్తూ ఈ విషయాల్ని వెల్లడించారు. ‘సౌత్ సినిమాలన్నీ నాలుగు భాషల్లో విడుదలైతే మనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది. దాంతో మరిన్ని గొప్ప సినిమాల్ని వీక్షించే అవకాశం దక్కుతుంది’ అని రానా పేర్కొన్నారు. కమర్షియల్ చిత్రాలు మొదలుకొని సమాంతర, ఆర్ట్ రూపాల్లో కూడా కన్నడ ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుతో దూసుకుపోతున్నదని రానా ప్రశసించారు.