Ramayana Review | రామాయణం రివ్యూ: రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ – 1’ మెప్పించిందా?
Ramayana | భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది నితీశ్ తివారీ ‘రామాయణ’. ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈసినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
సినిమా పేరు: రామాయణం
తారాగణం: రణబీర్‌కపూర్, సాయిపల్లవి, యశ్, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌సింగ్, రవి దూబే, వివేక్ ఒబెరాయ్, అరుణ్‌గోవిల్.
దర్శకత్వం: నితీశ్ తివారీ
నిర్మాత: నమిత్ మల్హోత్రా
సంగీతం: హన్స్ జిమ్మర్, ఏ.ఆర్.రెహమాన్
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది నితీశ్ తివారీ ‘రామాయణ’. ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈసినిమాపై అంచనాలు మొదలయ్యాయి. రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మండోదరిగా కాజల్, కైకసిగా శోభన, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్.. ఇలా తారాగణ వివరాలు తెలియగానే ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రచార చిత్రాలు సైతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికీ, నెక్ట్స్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి అని ప్రకటించగానే, తొలిపార్ట్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆతృతగా ఎదురు చూశారు. అనుకున్నట్టే ‘రామయాణ – 1’ సినిమా గురువారం థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి అందరి అంచనాలనూ ఈ సినిమా అందుకున్నదా? ఈ సినిమాకు ముందు బాలీవుడ్లోనే తెరకెక్కిన ‘రామాయణ’ ఇతిహాసం ‘ఆది పురుష్’ ఆడియన్స్‌కి, నిర్మాతలకు చేదు అనుభవాలను మిగిల్చింది. మరి నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ‘రామాయణం’ ప్రేక్షకుల ఎలాంటి అనుభూతినిచ్చింది? అనేది తెలుసుకునే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
ఇది యుగయుగాలుగా భారతీయుల రక్తంలో జీర్ణించుకుపోయిన కథ. కాబట్టి రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది జగమెరిగిన కావ్యం. అయితే.. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందించారు కనుక, ఈ తొలి భాగం దశాననుడు రావణుడిగా మారిన పరిణామక్రమాన్ని, శ్రీరాముడి జన్మవృత్తాతం, తాటక వధ, శివధనుర్భగం, సీతారామలక్ష్మణ వనవాసం, కబంధనుని వధ, కరదూషణాధుల వధ, సీతాపహరణం, జటావు మరణం ఘట్టాలతో సాగింది. జాటాయు మరణానంతరం ‘రావణుడ్ని సంహరించబోతున్నాను’ అంటూ రాముడు ప్రతిజ్ఞ చేయడంతో ఈ తొలి భాగం ముగిసింది. ఇక సుందరకాండ, రావణ వధ, శ్రీరామపట్టాభిషేకం తదితర అంశాలన్నీ రెండో పార్ట్‌లో ఉంటాయన్నమాట.
విశ్లేషణ
దేవదానవ సంగ్రామంలో ఓడిపోయి, రాజ్యాన్ని పోగొట్టుకొని పాతాళలోకంలో తలదాచుకున్న రాక్షస జాతికి పునరుజ్జీవాన్ని అందించేందుకు దానవరాణి కైకసి, తన తనయుడు దశాననుడిలోని పౌరషాగ్నిని రగిల్చడం, ఘోర తపస్సు చేసి, బ్రహ్మ దేవుడి వరాన్ని పొందిన దశాననుడు దానవసామ్రాట్టు రావణబ్రహ్మగా లంకా రాజ్య సింహాసన్నా అధిష్టించడంతో కథ మొదలైంది. ప్రతినాయకుడి శక్తిసామర్థ్యాలను అద్భుతంగా ఆవిష్కరించి, కథానాయకుడు సాధించబోయే కార్యం ఎంత కష్టతరమైనదో ప్రేక్షకులకు వివరించడంలో ముందు దర్శకుడు నితీశ్ తివారీ సక్సెస్ అయ్యారు. నిజానికి రావణుడి పాత్రకు ఆయనిచ్చిన ఎలివేషన్స్ రాముడికి కూడా ఇవ్వలేదు. నిజానికి రాముడికి ఎలివేషన్ అవసరం లేదు కూడా. రావణుడనేవాడు ఎంతటి మహావీరుడైనా, శక్తివంతుడైనా చివరకు వాడు పోయేది రాముడి చేతిలోనే అని ఆడియన్స్‌కి తెలుసు కాబట్టి, ఎలివేషన్స్ అవసరం లేదనుకుని ఉండొచ్చు. సాదాసీదాగా రాముడి పాత్రను కథలోకి ప్రవేశింపజేసి, నిదానంగా ఆడియన్స్‌కి ‘శ్రీరాముడు’ అనే వ్యాక్సిన్‌ని ఆడియన్స్‌కి ఇంజెక్ట్ చేశాడు దర్శకుడు నితీశ్. సినిమా చూడంగ చూడంగ.. రణబీర్‌లో రాముడ్ని చూడటం మొదలుపెట్టారు ఆడియన్స్. రణబీర్ కూడా అభినయం విషయంలో అద్బుతం అనిపించాడు. అయితే.. అతని ఆహార్యం బావున్నా.. నీలమేఘశ్యాముడిగా రాముడ్ని చూపించకపోవడం తెలుగువారికి మింగుడు పడదు. అందుకే.. రణబీర్‌ని రాముడిగా ఒప్పుకోవడానికి కాస్తంత టైమ్ పడుతుంది. నిజానికి ‘రామాయణం’లోని బాలకాండ, అరణ్యకాండ కాస్త స్లోగా అనిపిస్తాయి. కానీ దర్శకుడు నితీశ్ తివారీ ఎక్కడా జనానికి విసుగు అనిపించకుండా, తొలి పావుగంట రావణాసుడి ఎపిసోడ్‌తో, తర్వాత తాటక వధ, కంబధ వధ, కరదూషణాదుల వధ, జటాయు మరణం.. లాంటి అద్భుతమైన యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి, ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా ఆసక్తికరంగా, అందరికీ నచ్చేలా తీసి, సక్సెస్ అయ్యారు. అయితే.. ఇప్పటివరకూ రావణమాత కైకసి పాత్రను పాజిటీవ్‌గానే మనం చూశాం.కానీ ఈ సినిమాలో కైకసి నుంచి రావణుడ్ని విష్ణుద్వేషం మొదలైనట్టు చూపించారు. అలాగే.. శ్రీరాముడి ముందు భార్గవరాముడు మోకరిల్లడం లాంటి సీన్స్ కూడా జనానికి మింగుడు పడవు. అయితే.. మిగతా సన్నివేశాలన్నీ జనరంజకంగా తెరకెక్కించారు. మొత్తంగా తొలిభాగంతోనే దర్శకుడు నితీశ్ జనాల్లో మంచి మార్కులు సంపాదించుకున్నారు.
నటీనటులు
రాముడిగా రణబీర్ చక్కగా అభినయించాడు. పరశురాముడిగా కూడా ఓ సన్నివేశంలో కనిపించి అదరహో అనిపించుకున్నారు. ఇక సీతగా సాయిపల్లవి ఒదిగిపోయి నటించింది. ఆమె ఆహార్యం, అభినయం నిజంగా అద్భుతం. ఇందులో సీతను కూడా ఓ యోధురాలిగా చూపించి, ఓ కొత్త ప్రయోగానికి తెరలేపారు దర్శకుడు నితీశ్. రామాయణాన్ని నిశితంగా గమనించిన వారికి, అలా చూపించడం తప్పు కాదు అనిపిస్తుంది. ఎందుకంటే.. మహావీరులు, మహాబలులు సైతం ఎత్తలేని శివధనుస్సును అలవోకగా ఎత్తిన మహాబలశాలి సీతామ్మ. అలాంటి సీతమ్మ యోధురాలు ఎందుకు కాకూడదు?. మొత్తంగా సాయిపల్లవి సీతగా చాలా బాగా నటించింది. సీతాసాధ్విగా, వీరనారిగా పలు కోణాలను ఆమె పలికించిన తీరు బావుంది. లక్ష్మణుడిగా రవి దూబే కూడా బావున్నాడు. ఇక రావణుడిగా యశ్ అయితే.. విశ్వరూపం చూపించాడు. శూర్పణఖ పాత్రకు రకుల్ ప్రీత్‌సింగ్ నటన ఓ గౌరవాన్ని తెచ్చింది. మిగతా నటీనటులంతా పరిధిమేర తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా
సాంకేతికంగా అన్ని విభాగాలూ బాగా పనిచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్(ఏఐ) ఉపయోగించి డబ్బింగ్ విషయంలో, అచ్చంగా తెలుగు సినిమాను చూస్తున్న అనుభూతినే తీసుకురాగలిగారు. లిప్ సింక్ కూడా సరిగ్గా సరిపోయింది. కెమెరా పనితనం బావుంది. ఏఆర్ రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం భావగర్భితంగా, కథ స్థాయికి తగ్గట్టుగా సాగింది. యాక్షన్ అంశాలను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. సీజీ వర్క్ అయితే.. నేచురల్‌గా అనిపించింది. మొత్తంగా నిర్మాత పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపించింది.
రావణాడ్ని సంహరిస్తానని రాముడు చెప్పడంతో ప్రథమార్థం ముగిసింది. సెకండ్‌పార్ట్‌లో ఆంజనేయుడు రాబోతున్నాడని హింట్ ఇస్తూ.. ఆంజనేయుడి బిట్స్‌ని చూపించి, సముద్రాన్ని లంఖిస్తున్న మారుతిగా సన్నీడియోల్‌ని వెనకనుంచి చూపించడం ఆడియన్స్‌కి గూస్బంప్స్ తెప్పించాయి. హనుమాన్‌చాలీసా వస్తుండగా టైటిల్స్ దిగుతుంటే.. ఆంజనేయుడి ఆగమానం గుర్తొచ్చి జనం భావోద్వేగానికి లోనయ్యారు.
చివరిగా ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన సినిమా ‘రామాయణం’.
బలాలు
కథనం, నటీనటుల నటన, సాంకేతికత..
బలహీనతలు
పాత్రలకు విరుద్ధంగా అనిపించిన కొన్ని సన్నివేశాలు
రేటింగ్ 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Review | రామాయణం రివ్యూ: రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ – 1’ మెప్పించిందా?
Mahasakthi | నయనతార ‘మహాశక్తి’కి తెలుగులో గట్టి పరీక్ష.. రేపే థియేటర్లలోకి, పోటీగా ‘రామాయణ’, ‘సీన్’!
Walking | కండరాలు దృఢంగా మారాలంటే వాకింగ్ సరిపోతుందా.. దీంతో ఏం జరుగుతుంది..?
Paris Jackson: 600 మిలియన్ల డాలర్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన మైఖేల్ జాక్సన్ కుమార్తె
T-Hub | కలలకు రెక్కలు తొడిగి 11 వసంతాలు: అంతర్జాతీయ ఆవిష్కరణల వేదికగా ఎదిగిన ‘టీ-హబ్’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

