Ramani Kalyanam | విభిన్నమైన కథాంశాలతో వచ్చే చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారన్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే, ‘నడవలేని ఒక అబ్బాయి, చూపులేని ఒక అమ్మాయి’ మధ్య సాగే సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రమణి కళ్యాణం’. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాను విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల సంయుక్తంగా నిర్మించారు. మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించి, ఒక రోజు ముందే ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం…
కథ
సంజన (దీప్షిక) చిన్నతనంలోనే జరిగిన ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. అయినప్పటికీ, తానొక అంధురాలినని ఎక్కడా కుంగిపోకుండా, ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంటుంది. కిషోర్ (శ్రీనివాస రెడ్డి) నడుపుతున్న పబ్‌లో సింగర్‌గా, అలాగే ఒక ఎఫ్ఎమ్ రేడియోలో ఆర్జేగా పని చేస్తూ.. నలుగురు పిల్లలు, ఒక బామ్మతో కూడిన తన కుటుంబాన్ని పోషిస్తుంటుంది. మరోవైపు, కిషోర్ స్నేహితుడైన రాజ్ (సూర్య వసిష్ఠ) కాళ్లు పడిపోయి వీల్ చైర్‌కే పరిమితమవుతాడు. తన గతాన్ని, ఆశయాలను తలుచుకుంటూ బాధపడే రాజ్ జీవితంలోకి సంజన ప్రవేశిస్తుంది. మొదట్లో చిన్న గొడవతో ప్రారంభమైన వీరి పరిచయం, ఆ తర్వాత ఒకరిపైకొకరికి ఉన్న గౌరవంతో ప్రేమగా మారుతుంది. సంజన అందించిన స్ఫూర్తితో రాజ్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్న తరుణంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు రాజ్ వీల్ చైర్‌కే ఎందుకు పరిమితమయ్యాడు? సంజనతో ఉన్న ఆ నలుగురు పిల్లలు ఎవరు? చివరికి వీరి కల్యాణం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
ట్రైలర్, టీజర్లతోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, వెండితెరపై కూడా అదే వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేసింది. సినిమా ప్రథమార్ధం అంతా ప్రధాన పాత్రల పరిచయం, వారి మధ్య చిగురించే ప్రేమ చుట్టూ క్యూట్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ఒక భావోద్వేగ సన్నివేశం ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే ఉత్కంఠను దర్శకుడు బాగానే నిర్వహించారు. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ సీన్లు మరింత హృదయవిదారకంగా ఉంటాయి. మనుషులకు శారీరక లోపాలు ఉన్నా, వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలనే మంచి సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ఫుల్గా, రిచ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది, కానీ పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం ప్రథమార్ధంలో ఉన్న కొన్ని ల్యాగ్ సీన్స్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఇటువంటి సున్నితమైన కథాంశాన్ని తెరకెక్కించడంలో మంచి ప్రతిభే కనబరిచారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
నటీనటుల ప్రతిభ:
దీప్షిక చంద్రన్ చూపులేని అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. కొన్ని సీన్లలో నిజంగానే ఆమెకు కళ్లు లేవా అనేంత సహజత్వాన్ని ప్రదర్శించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సూర్య వసిష్ఠ సినిమా అంతా వీల్ ఛైర్‌కే పరిమితమైన సవాలుతో కూడిన పాత్రలో చక్కని హావభావాలు పండించాడు. శ్రీనివాస రెడ్డి ఎప్పుడూ కామెడీ పాత్రలతో నవ్వించే ఆయన, చాలా కాలం తర్వాత ఒక చక్కటి ఎమోషనల్ పాత్రలో కనిపించి మెప్పించారు.
యాంకర్ శ్యామల, లోహిత్ కుమార్, చైతన్య జొన్నలగడ్డ, ప్రభావతి తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
బలాలు:
వైవిధ్యమైన కథాంశం
నటీనటుల అద్భుత నటన
శ్రీనివాస రెడ్డి కొత్త కోణం
ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ & క్లైమాక్స్
నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు
బలహీనతలు:
నెమ్మదైన కథనం
స్పష్టత లేని పాత్రలు
రొటీన్ సెకండ్ హాఫ్
ముగింపు:
‘రమణి కళ్యాణం’ శారీరక వైకల్యాలు ఉన్న ఇద్దరు మనసుల మధ్య సాగే స్వచ్ఛమైన, ఎమోషనల్ ప్రేమకథ. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, గుండెకు హత్తుకునే డ్రామాను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 3 / 5