సూర్య అయ్యలసోమయాజులు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రామ్’ (ర్యాపిక్ యాక్షన్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. ధన్య బాలకృష్ణ కథానాయిక. ఈ నెల 26న విడుదలకానుంది. మంగళవారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
దర్శకుడు మట్లాడుతూ ‘తీవ్రవాదుల దాడుల నుంచి మనల్ని కాపాడే హీరోల సాహసాలను ఈ సినిమాలో చూపించాను. దేశభక్తి ప్రధానంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. చాలా రోజుల తర్వాత దేశభక్తి ప్రధానమైన సినిమాలో నటించానని సీనియర్ నటుడు సాయికుమార్ తెలిపారు. ఎందరో సీనియర్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారని, కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయని నిర్మాత దీపికాంజలి పేర్కొంది.