Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని తన సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ‘RAPO23’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా నిలవనుంది. ఈ సినిమాతో రామ్ కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడం విశేషం. ఇప్పటివరకు నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఈసారి మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ స్టోరీని కూడా స్వయంగా రామ్ రాసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
సోమవారం హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా ‘RAPO23’ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నిర్మాత కృష్ణ పొతినేని స్క్రిప్ట్‌ను రామ్‌కు అందజేయగా, సీనియర్ నటుడు మురళీమోహన్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత పీవీ రవికిశోర్ క్లాప్ కొట్టగా, తొలి షాట్‌కు స్వయంగా రామ్ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. రామ్‌తో పాటు ప్రధాన తారాగణం ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. ‘RAPO23’ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. నియో నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో రామ్ ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. కథ, పాత్ర, ట్రీట్మెంట్ అన్ని పరంగా ఈ సినిమా రామ్ కెరీర్లో అత్యంత విభిన్న చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని కృష్ణ పొతినేని నూతనంగా స్థాపించిన ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాణ విలువలు, సాంకేతిక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ తిరు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హైన్ నిర్వహిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. ఈ సాంకేతిక బృందం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేతా పేతురాజ్ నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం ఇంకా పూర్తి తారాగణాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.