Vyooham | తన సినిమా థియేటర్లోనే విడుదల కావాలి.. అక్కడ విజయం సాధించాలి.. కలెక్షన్స్ బాగా రావాలి.. ఇలాంటి ఆలోచనలు ఏమి సినిమా తీసేటప్పుడు అసలు ఆలోచించడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఏదో అనిపిస్తుంది.. కథ రాయాలి అనుకుంటాడు.. దాన్ని సినిమాగా తీస్తాడు అంతే.. ఆ తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచించమంటే కూడా ఆలోచించడు వర్మ. చాలా విచిత్రమైన మెంటాలిటీ ఉన్న ఈ దర్శకుడు తాజాగా వ్యూహం (Vyooham) అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నిజానికి నవంబర్ 10న విడుదల కావాలి.. కానీ సెన్సార్ చేయడానికి కూడా భయపడేలా ఈ సినిమాను తెరకెక్కించాడు వర్మ. అందుకే విడుదల ఆగిపోయింది.
నిజ జీవిత పాత్రల పేర్లు, వాళ్ళ ప్రవర్తన, రాజకీయ సంఘటనలు ఇలా ఎన్నో వ్యూహం సినిమాలో ఉండడంతో దాన్ని బయటికి తీసుకొస్తే.. రాజకీయ దుమారం రేగడం ఖాయమని.. ఎన్నికల సమయంలో లేనిపోని గొడవలు వస్తాయని భావించి దాన్ని విడుదల చేయొద్దు అంటూ ఆపేశారు సెన్సార్ బోర్డు. వైయస్ జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత.. వైసిపి పెట్టాక ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యూహం సినిమా తెరకెక్కించాడు వర్మ. సెన్సార్ సభ్యులు అడ్డుకోవడంతో దాన్ని దర్శక నిర్మాతలు ఛాలెంజ్ చేశారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. నవంబర్ 10 వ్యూహం విడుదల కాలేదు. అయితే ఈ సినిమాను నేరుగా యూ ట్యూబ్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.
గతంలోను ఆయన సినిమాలను అలా డైరెక్ట్ గా యూ ట్యూబ్ లో విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే చేయాలని భావిస్తున్నాడు వర్మ. వ్యూహం సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి అని ఆయనకు బాగా తెలుసు. అందుకోసమే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. ఆ మధ్య అడిగినప్పుడు కూడా ఈ సినిమాను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పాడు వర్మ. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవి. మొదటి భాగం వ్యూహం.. రెండో భాగం శపథం. జనవరి 25న రెండో భాగాన్ని విడుదల చేయాలని చూస్తున్నాడు.
కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది విడుదల కావడం కష్టమే. ఎందుకంటే ఏపీ ఎన్నికలు మరింత దగ్గరకు వస్తున్న సమయంలో వర్మ సినిమాలను థియేటర్లో విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా కూడా వ్యూహం కచ్చితంగా జనాల్లోకి వస్తుందని.. దాన్ని ఎన్ని వ్యూహాలు వేసి ఆపాలని చూసినా ఖచ్చితంగా విడుదల చేస్తాను అంటూ భీష్ముంచుకు కూర్చున్నాడు వర్మ.