దసరా పండుగ సందర్భంగా క్రేజీ అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, ఎట్టకేలకు దీనిపై ప్రకటన వచ్చింది. నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ వచ్చింది అని రామ్ చరణ్ ప్రకటన చేశాడు. యూవీ క్రియేషన్స్ కూడా తమ ట్విట్టర్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన చేసింది.
గౌతమ్ తిన్ననూరి.. మళ్ళీరావా వంటి సినిమాతో పెద్ద హిట్ తర్వాత నానితో కలిసి జెర్సీ చేశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక పలు అవార్డులు కూడా అందుకుంది. ఎమోషనల్ కాన్సెప్ట్ మూవీలను తెరకెక్కించడంలో దిట్టగా పేరున్న గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు చరణ్‌ను ఎలా ప్రెజంట్ చేస్తాడనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.మాస్ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది.
రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే శంకర్ చిత్రంపై కూడా చరణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాతే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. బహుశా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలు కావచ్చు.