Rakasa | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె నిర్మించిన ‘రాకాస’ సినిమా విడుదలైన తొలి రోజునుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ‘రాకాస’ చిత్రాన్ని ఓటీటీ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మానస శర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, నయన్ సారిక హీరోయిన్గా మెప్పించారు. హారర్, కామెడీ, ఫాంటసీ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.
ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదలైన ‘రాకాస’ సినిమా, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో ముందుగానే మంచి అంచనాలు ఏర్పరచుకుంది. విడుదలైన తర్వాత ఆ అంచనాలను మించి ప్రేక్షకులను అలరించడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘రాకాస’ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. శుక్ర, శనివారాల్లో వచ్చిన రెస్పాన్స్ ఆదివారం మరింత పెరగడంతో వసూళ్లు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా, విడుదలైన తొలి 24 గంటల్లోనే 60 వేలకుపైగా టికెట్స్ అమ్ముడవడం విశేషం. డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా సినిమాకు ప్లస్ అయిందని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పటికే నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిహారిక, ‘రాకాస’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లు కనిపిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, నయన్ సారిక గ్లామర్, సపోర్టింగ్ క్యాస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసి సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా హారర్ కామెడీ జానర్‌ను కొత్తగా ప్రెజెంట్ చేయడంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘రాకాస’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తూ, నిహారిక కొణిదెలను విజయవంతమైన నిర్మాతగా మరోసారి నిలబెడుతోంది.