అగ్ర కథానాయిక కీర్తి సురేష్ పట్టిందల్లా బంగారమవుతున్నది. గత రెండేళ్లుగా ఈ భామకు మంచి విజయాలు దక్కుతున్నాయి. తెలుగులో గత ఏడాది ‘భోళా శంకర్’ ‘దసరా’ భారీ సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘రఘుతాథ’ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. రాజకీయాంశాల నేపథ్యంలో కామెడీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. 1980 నేపథ్య కథ ఇది. శనివారం ట్రైలర్ను విడుదల చేసారు.
ఇందులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనే మహిళగా కీర్తి సురేష్ పాత్రను చూపించారు. తన మాతృభాష తప్ప వేరే ఏ భాషను అర్థం చేసుకోలేక సతమతమయ్యే యువతిగా ఆమె క్యారెక్టర్లో చక్కటి వినోదం పండింది. ‘నేను నటించిన పూర్తిస్థాయి కామెడీ చిత్రమిది. ఈ సినిమాలో నేను చేసే సాహసాలు, ఈ క్రమంలో పండే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. సిసలైన వినోదానికి చిరునామా ఇది’ అని కీర్తి సురేష్ పేర్కొంది. సుమన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.