‘ఈ సినిమాలో ఆద్యంతం సాగే కీలకమైన పాత్రను చేశాను. నేపథ్య సంగీతం కూడా ఇందులో సహజంగా ఉంటుంది. పాత్రలను బీజీఎం ఎక్కడా డామినేట్ చేయకుండా, సెటిల్డ్‌గా కంపోజ్ చేశాను. అటు నటుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా ‘గేదెల రాజు’ నా కెరీర్లోనే సమ్‌థింగ్ స్పెషల్’ అని నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలూకా’ అనేది ఉపశీర్షిక. చైతన్య మోటూరి దర్శకుడు. వాణి రవికుమార్ మోటూరి నిర్మాత. ఈ నెల 24న సినిమా విడుదల కానున్నది.
సోమవారం రఘు కుంచె విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో నా పాత్ర భయపెట్టేలా ఉండాలి. అందుకే 12కేజీల బరువు పెరిగాను. ఇంటర్వెల్ ఫైట్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆ ఫైట్‌లో డూప్ కత్తులు దొరక్క నిజమైన కత్తుల వాడారు. నేను పోషించిన ‘గేదెలరాజు’ పాత్రను దర్శకుడు చాలా క్రూయల్‌గా డిజైన్ చేశాడు. ఆ పాత్రను తెరపై చూస్తుంటే నాకే వాడ్ని చంపేయాలనిపించింది. రేపు ఆడియన్స్‌కి అలాగే అనిపిస్తుంది’ అని చెప్పారు కుంచె రఘు. తెలంగాణ, ఏపీ కలిపి 200 స్క్రీన్స్, ఓవర్సీస్ 60 లొకేషన్స్‌లో సినిమా రిలీజ్ అవుతున్నదని ఆయన తెలిపారు.