R Madhavan | ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ ‘GDN’ (జి.డి. నాయుడు). ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పిన గొప్ప ఆవిష్కర్త, ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పిలవబడే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాధవన్‌తో పాటు సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, తంబి రామయ్య, వినయ్ రాయ్, యోగి బాబు వంటి సౌత్ సినిమాకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఓహో ఎంతన్ బేబీ’ ఫేమ్ కృష్ణకుమార్ రామకుమార్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహిస్తుండగా, ’96’ ఫేమ్ గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్ మరియు మాధవన్‌కు చెందిన ట్రైకలర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గతంలో జాతీయ అవార్డు గెలుచుకున్న ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ తర్వాత ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న రెండో బయోపిక్ ఇది కావడం విశేషం.
ఇక తాజాగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్లో మాధవన్ బ్రిటీష్ కాలం నాటి పీరియాడికల్ లుక్‌లో అద్భుతంగా కనిపిస్తున్నారు. జనాల మధ్యలో చేతులు జోడించి నిలబడిన మాధవన్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ పోస్టర్‌పై Feared by the British, Forgotten by his countrymen (బ్రిటీషర్లు భయపడిన వ్యక్తి, స్వదేశీయులు మర్చిపోయిన మహానుభావుడు) అనే క్యాప్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. జూలై 17న వెండితెరపై ఈ సరికొత్త చరిత్రను చూడటానికి ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#GDN — inspired by the extraordinary journey of G. D. Naidu. Releasing worldwide on July 17 distribution by @Ags_production @ActorMadhavan pic.twitter.com/8VUouw1Nrv
— sridevi sreedhar (@sridevisreedhar) May 21, 2026