Sequel Movies | సీక్వెల్ సినిమాల పేర్లు మారడం ఓకే! కథలో మార్పులు, చేర్పులూ డబుల్ ఓకే!! కానీ, హీరోహీరోయిన్లనూ మార్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కథ డిమాండ్ చేసిందనీ, పాత్ర బరువు మోయడానికనీ.. ఈ మార్పులుచేపడుతున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా సీక్వెల్ పాత్రలు మరింత రాటుదేలి ఉంటున్నాయి. పాత పాత్రలో మెప్పించిన నటీనటుల తీరుతెన్నులకు ఏ మాత్రం సంబంధం లేకుండా కొత్త పాత్రను సరికొత్తగా పండించి అలరిస్తున్నారు నటీనటులు.
లకలకల‘కళ’ మారింది..
మలయాళంలో చంద్రముఖిగా శోభన నయన మనోహరంగా అలరించింది. కన్నడనాట అదే పాత్రలో సౌందర్య కనువిందు చేసింది. తమిళ, తెలుగు భాషల్లో జ్యోతిక హావభావాలకు ప్రేక్షకులు ఊగిపోయారు. హిందీలో విద్యాబాలన్ విన్యాసం గుర్తుంచుకోదగ్గదే!! అందరూ మేటి నటీ మణులే! కొనగంటి చూపుతో కోటి భావాలు పలికించే వాళ్లే!! ఒక్కో భాషలో ఒక్కో చంద్రముఖిని ఆవిష్కరించిన వైనం వెండితెరపై కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఇన్ని భాషల్లోనూ ఒకే చంద్రముఖి పలకరిస్తున్నది. సీక్వెల్ ఈక్వేషన్‌కు కొత్త నిర్వచనం చెబుతూ చంద్రముఖిని ఆవాహన చేసుకున్న కంగన సరికొత్తగా ‘లకలకలక..’ అంటూ విడుదలకు సిద్ధమవుతున్నది.
‘చంద్రముఖి 2’ వస్తున్నది
అనగానే.. ఓటీటీలో చంద్రముఖి ఒకటికై వెతికిన వారు కోకొల్లలు. చంద్రముఖిగా కంగనా రనౌత్ కటౌట్ కంటపడగానే ఎంత చక్కగా ఉంది అనుకున్నవాళ్లు ఎందరెందరో! అదే సమయంలో జ్యోతిక పలికించిన హావభావాలను పాజ్ చేసి మరీ పదేపదే చూసి భలేగా చేసిందని అనుకున్నారు. ఇప్పుడు కంగన ఎలా మెప్పిస్తుందో అని అంచనాలు వేస్తున్నారు. సీక్వెల్ సినిమాలు రావడం ఇండస్ట్రీలో మామూలే! అలా వచ్చిన చిత్రాల్లో మూలకథ మారదు. బాహుబలి, కేజీఎఫ్ తదితర చిత్రాల సీక్వెల్స్ అన్నీ పాతకథకు కొనసాగింపుగా వచ్చినవే! అంతేకాదు, అందులోని ప్రధాన పాత్రల్లోని నటీనటులూ పాతవాళ్లే ఉండటం మనం చూశాం.
కానీ, సీక్వెల్ సినిమాల్లో మొదటి దానికి కొనసాగింపు కథనే ఎంచుకున్నా.. పాత్రలనూ అవే ఉంచినా.. అందులో నటీనటులను మార్చడం ఇప్పుడు ట్రెండ్. తాజాగా విడుదల కాబోతున్న ‘చంద్రముఖి 2’ దర్శకుడు పి.వాసు. తెలుగు, తమిళ భాషల్లో 2005లో విడుదలైన చంద్రముఖిని ఆవిష్కరించిందీ ఈయనే. రెండో చిత్రంలో రజినీకాంత్ నటించిన పాత్రలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నాడు. జ్యోతిక మెప్పించిన పాత్రను కంగన ఒప్పుకోవడంతో బాలీవుడ్‌లోనూ బొనాంజా ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రచార ఆర్భాటం కూడా ‘చంద్రముఖి 2’ కోసం ఎదురుచూసేలా చేస్తున్నది. ఇంతకీ ఈ కొత్త లకలకలక ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే నాలుగు రోజులు వేచి చూడాల్సిందే!
‘హిట్’ ఫ్రాంచైజీ
ఫ్రాంచైజీ సినిమా హాలీవుడ్‌కు పాతదే. బాలీవుడ్లో కొత్తకాదు! తెలుగులో మాత్రం ఈ తరహా సీక్వెల్ సినిమాలు కొత్తే! గతంలో ఒకట్రెండు ఈ తరహా సినిమాలు వచ్చినా ఒక ట్రెండు సృష్టించింది మాత్రం ‘హిట్’ చిత్రమే! 2020లో విశ్వక్సేన్ హీరోగా విడుదలైన ‘హిట్- ద ఫస్ట్ కేస్’ సంచలన విజయం సాధించింది. దీనికి కథను అందించడంతోపాటు దర్శకత్వం వహించిన శైలేశ్ కొలను సూపర్ హిట్ దర్శకుడు అనిపించుకున్నాడు. ఇదే ఊపులో 2022లో ‘హిట్- ద సెకండ్ కేస్’ సినిమా తీసుకొచ్చాడు. ఇందులో కథానాయకుడిగా విశ్వక్సేన్ను కాదని అడివి శేష్‌ను ఎంచుకున్నాడు.
కథలు వేరైనప్పుడు హీరో మాత్రం ఒకరే ఎందుకు ఉండాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఈ ఫ్రాంచైజీలో రాబోయే ఒక్కో చిత్రానికీ ఒక్కో హీరోను ఎంపిక చేసుకోవాలని ఫిక్సయినట్టున్నాడు. దీనికి నిదర్శనంగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘హిట్-3’లో కథానాయకుడు నాని. ‘హిట్-2’ పతాక సన్నివేశాల్లోనే ఈ సంగతి రివీల్ చేసి అందరిలోనూ ఆసక్తిని పెంచాడు దర్శకుడు.
‘కిక్’ తగ్గింది..
దర్శకుడు సురేందర్ రెడ్డి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో 2009లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కిక్’. పక్కా కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. రవితేజ కెరీర్లో విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్‌తోపాటు కామెడీ బాగా పండటంతో ఇప్పటికీ కొత్త కిక్ కావాలనుకునే వాళ్లు ‘కిక్’ సినిమా చూసేస్తుంటారు. ఈ చిత్రం విడుదలైన ఆరేండ్లకు వీరిద్దరి కాంబినేషన్లోనే ‘కిక్ 2’ సినిమా వచ్చింది. అయితే ‘కిక్’లో కథానాయికగా ఇలియానా అలరిస్తే.. ‘కిక్ 2’లో రకుల్‌ప్రీత్ సింగ్ కనిపిస్తుంది. ‘కిక్’ హీరో కల్యాణ్ కొడుకుగా ‘కిక్ 2’లో ‘రాబిన్‌హుడ్’గా రవితేజ అలరించాడు. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయింది. కథానాయిక పాత్రలో రకుల్ నటన ఆమె కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది.
నమో కార్తికేయం
విభిన్న కథలను ఎంచుకుంటూ, వినూత్న కథానాయకుడు అనిపించుకున్నాడు నిఖిల్. చిన్నహీరోగా మొదలైన అతని కెరీర్ ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా లెవల్‌కు చేరుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా వచ్చిన సినిమా ‘కార్తికేయ’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లను రాబట్టింది. నిఖిల్‌ను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసింది కూడా! మళ్లీ 8 ఏండ్ల తర్వాత చందు, నిఖిల్ కాంబో కుదిరింది.
2022లో విడుదలైన ‘కార్తికేయ 2’ ఊహించని రేంజ్లో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఊహించని మలుపులతో డిఫరెంట్ జానర్ మూవీగా పేరొందింది. అయితే ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించడం విశేషం. హీరో పాత్ర ‘కార్తికేయ 1’కి కొనసాగింపుగా చూపించిన దర్శకుడు కథానాయిక విషయంలో మాత్రం పాతవారిని కాదని కొత్తవారిని ఎంచుకోవడం విశేషం. అంతేకాదు, ఈ సినిమా ముగింపులో దీనికి సీక్వెల్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. మరి అందులో హీరోయిన్గా అనుపమ కొనసాగుతుందా, మరొకరిని ఎంచుకుంటారా అన్నది వేచి చూడాలి.
ఇవీ ఈ కోవకే..
సీక్వెల్లో హీరోలు, హీరోయిన్లు మారిన సినిమాల జాబితా ఓ మోస్తరుగా పెద్దదే! 1998లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’ ఓ సంచలనం. జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించింది. తర్వాత 15 ఏండ్లకు ఆర్జీవీ సత్య-2 తెరకెక్కించాడు. ఇందులో హీరోగా శర్వానంద్ కనిపిస్తాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ 2016 సంక్రాంతి రేస్‌లో గెలుపు కోడిగా నిలిచింది.
కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. మళ్లీ ఆరేండ్ల తర్వాత 2022లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ‘సోగ్గాడే..’కు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం వచ్చింది. ఇందులో నాగార్జునతోపాటు నాగచైతన్య లీడ్ పాత్రలో కనిపిస్తాడు. హీరోయిన్గా కృతిశెట్టి కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో సోనాలి బెంద్రే హీరోయిన్గా అలరిస్తే,
శంకర్‌దాదా జిందాబాద్లో
కథానాయికగా కరిష్మా కోటక్ నటించింది. మొత్తానికి సీక్వెల్ చిత్రాల్లో పాత్రల తీరుతెన్నులు
మారకున్నా… అందులో నటీనటులు మారుతుండటం విచిత్రం.