కన్నడ చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించి, అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మమత దేవేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి, తెలుగులో మహారత్న ప్రొడక్షన్స్ మరియు ఎస్కే పిక్చర్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో పూర్తి సమీక్షలో తెలుసుకుందాం.
కథ
నాగన్న (రంగాయణ రఘు) భార్య మరణించడంతో మరో పెళ్లి చేసుకోకుండా తన ఏకైక కొడుకు సంతోష్‌ను (శ్రీరామ్) పెంచుతాడు. సంతోష్ చదువుకు దూరంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. మరోవైపు ఊళ్ళోనే ఉండే వసంత (రమిక శివు) మగరాయుడిలా తిరుగుతూ, తన బావ సంతోష్ తనను ప్రేమిస్తున్నాడని నమ్ముతూ ఉంటుంది. కానీ నాగన్న మాత్రం తన కొడుక్కి బాగా చదువుకున్న అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టి ఉంటాడు. ఇదిలా ఉంటే, అమెరికా నుండి తిరిగివచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ) తన లవర్ మోసం చేయడంతో తీవ్రమైన డిప్రెషన్లో కూరుకుపోతుంది. అనుకోకుండా రుక్మిణిని చూసిన సంతోష్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. సరిగ్గా అదే సమయంలో నాగన్న తన కొడుకుని ఒక పెళ్లి పీటల మీద నిలిచిపోయిన తన ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తాడు. మరి సంతోష్ తన తండ్రి మాట కాదనలేక ఆ పెళ్లి చేసుకుంటాడా? రుక్మిణిపై ఉన్న ప్రేమను వదులుకుంటాడా? వసంత తన మనసులోని భావాలను సంతోష్‌కు చెబుతుందా? నాగన్న గతంలో చేసిన పెద్ద తప్పు ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెండితెరపైనే చూడాలి.
విశ్లేషణ:
ఇటీవల కాలంలో యాక్షన్, వైలెన్స్ చిత్రాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో, పూర్తిగా పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన భావోద్వేగాలతో కూడిన ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది. మొదటి భాగం హీరోహీరోయిన్ల పరిచయాలు, గ్రామ వాతావరణం, వసంత వన్-సైడ్ లవ్ ట్రాక్, సంతోష్ అల్లరితో సరదాగా సాగిపోతుంది. రుక్మిణి బ్రేకప్ ఎపాపిసోడ్ కథకు వేరే కోణాన్ని జోడిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక రెండో భాగం పూర్తిగా వివాహ బంధంలోని మనస్పర్థలు, అనుమానాలు, బాధ్యతలు మరియు ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే చివరి ముప్పై నిమిషాలు మాత్రం ప్రేక్షకలను కంటతడి పెట్టించేలా ఉంటాయి. తండ్రి – కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు, మానవ సంబంధాల విలువను చాటే సీన్స్ హత్తుకునేలా ఉన్నాయి. అయితే, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ కొద్దిగా సాగదీసినట్లు అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్‌లో కుటుంబ బంధాల మధ్య వచ్చే సన్నివేశాలను మరింత క్రిస్ప్‌గా ఎడిట్ చేసి ఉంటే సినిమా వేగం మరింత పెరిగేది.
నటీనటులు
హీరో శ్రీరామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సెకండ్ హాఫ్‌లో పరిణతి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు. రమిక శివు మగరాయుడి పాత్రలో మొదట్లో నవ్విస్తూనే, ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించింది. తపస్విని పూనాచ తన క్యూట్ లుక్స్‌తో మెప్పించింది. ఇక కన్నడ సీనియర్ నటుడు రంగాయణ రఘు తన నటనతో ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచారు. తండ్రిగా ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతికంగా
ఈ చిత్రానికి సంగీతం అతిపెద్ద ప్లస్ పాయింట్. అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయాయి. సినిమాటోగ్రఫీ పచ్చని పల్లెటూరి అందాలను, పొలాలను అద్భుతంగా కళ్లకు కట్టింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా, దాన్ని నడిపించిన విధానం బాగుంది. డబ్బింగ్ విషయంలో కొన్ని చోట్ల లిప్ సింక్ మిస్సయినా, మాటల రచయిత అందించిన డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ముగింపు
కుటుంబ సమేతంగా, ముఖ్యంగా భార్యాభర్తలు తప్పక చూడాల్సిన ఎమోషనల్ డ్రామా ఇది. పాతకాలపు జ్ఞాపకాలను, స్వచ్ఛమైన ప్రేమను గుర్తుచేసే ఈ సినిమా వీకెండ్లో మంచి అనుభూతిని పంచుతుంది.
రేటింగ్: 3