Prem Kumar Movie Trailer | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, కష్టపడే తత్వం ఈ మూడింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే సంతోష్ శోభన్ రేంజ్ వేరేలా ఉండేంది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ హిట్టు కొట్టలేకపోయాడు సంతోష్ శోభన్. ‘గోల్కొండ హై స్కూల్’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ నాలుగేళ్లకు ‘తాను నేను’ సినిమాతో హీరో అవతారమెత్తాడు. తొలి సినిమానే డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘పేపర్ బాయ్’ వంటి న్యూఏజ్ లవ్‌స్టోరీతో వచ్చాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్ లభించిన కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. దాంతో మరో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘ఏక్ మినీ కథ’ వంటి బోల్డ్ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది.
సంతోష్ శోభన్ పేరు కాస్తో కూస్తో జనాలకు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఫ్లాపుల బాట పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ ఐదు ఫ్లాపులు పలకరించాయి. దాంతో సంతోష్ మార్కెట్ అమాంతం పడిపోయింది. ప్రస్తుతం సంతోష్ ఆశలన్నీ ప్రేమ్ కుమార్ సినిమాపైనే ఉన్నాయి. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏడాది క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ.. పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆగస్టు 18న స్లాట్ బుక్ చేసుకుంది. ఈ మేరకు చిత్రయూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తు్న్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.
ట్రైలర్ తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది చిత్రబృందం. పెళ్లి కోసం పాట్లు పడే పాత్రలో సంతోష శోభన్ కనిపించబోతున్నాడు. పీటల దాకా వచ్చిన సంతోష్ పెళ్లిళ్లన్ని ఆగిపోతుంటాయి. దీంతో విసుగెత్తిపోయిన సంతోష్ ఒక బిజినెస్ పెడతాడు. బ్రేకప్, పెళ్ళికి ముందు అవసరమైన ఇన్వెస్టిగేషన్, కావాలంటే మూడు ముళ్ళు పడకముందే వాటిని ఆపేయడం ఇలా అన్ని సర్వీసులు ఇస్తాడు. కొన్ని రోజుల్లోనే పెళ్లిళ్లను చెడగొట్టడంలో స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకుంటాడు. అదే సమయంలో క్లయింట్ గా వచ్చిన హీరోయిన్ తో సంతోష్ లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సారైనా సంతోష్ పెళ్లి జరిగిందా? అనే వాటికి జవాబు దొరకాలంటే థియేటర్లో బొమ్మ చూడాల్సిందే.
ట్రైలర్ మొత్తం ఫన్ యాంగిల్ లోనే సాగింది. కంటెంట్ కూడా కొత్తగానే ఉంది. అన్ని కరెక్ట్ గా కుదిరితే మాత్రం ఈ సారి సంతోష్ హిట్టు కొట్టినట్లే. అయితే ఈ సినిమాకు వారం రోజుల ముందు భోళా శంకర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా దాని ప్రభావం ఖచ్చితంగా వారం రోజులు ఉంటుంది. అదీ కాకుండా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ అదే రోజు రిలీజ్ కానుంది. ఇప్పటివరకైతే ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. సితార సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రమోషన్లు గట్రా బాగా చేసి ఓవర్ నైట్ లో హైప్ తీసుకురాగలరు. మరీ ఈ మామా అల్లుళ్ల పోటీని తట్టుకుని సంతోష నిలబడతాడో లేదో చూడాలి.