తేజ సజ్జ, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘హనుమాన్’. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. టీజర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ…‘నా ఇష్ట దైవం హనుమంతుడి మీద సినిమా రూపొందించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించమని నిర్మాత ప్రోత్సహించారు.
సూపర్ హీరోలకు సూపర్ హీరో హనుమాన్. పురాణాల నుంచి స్ఫూర్తి పొంది చేసిన చిత్రమిది. అంజనాద్రి అనే కొత్త ప్రపంచంలో ఈ కథ సాగుతుంటుంది’ అన్నారు. హీరో తేజ సజ్జ మాట్లాడుతూ…‘హనుమంతుడిని మిం చిన సూపర్ హీరో ఎవరున్నారు? ఆయన గాలి కంటే వేగంగా ప్రయాణిస్తారు. బుద్ధి, భుజ బలంలో సాటి లేని వాడు. అలాంటి ఒక యోధుడి నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని చేశాం. ఆంజనేయుడి అనుగ్రహంతో ఒక యువకుడికి శక్తి వస్తే అతను అలాంటి సాహసాలు చేశాడు, చెడుపై ఎలా పోరాటం చేశాడు అనేది నా పాత్ర ద్వారా చూపిస్తున్నాం. విజువల్ ఫీస్ట్ అనుభూతిని కలిగిస్తుంది’ అన్నారు.