Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ బిజీయెస్ట్ హీరోగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ వర్కింగ్ టైటిల్ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను ‘ఫౌజీ’పై పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించారు. ఆయన సహకారంతో చిత్ర యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తుండటంతో షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరడంతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో డిజిటల్ హక్కుల డీల్‌ను క్లోజ్ చేసే పనిలో ఉంది. ఈ బిజినెస్ డీల్ అధికారికంగా పూర్తయిన వెంటనే చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనుంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వేసిన భారీ సెట్లలో ప్రస్తుతం కీలక యాక్షన్ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ భారీ పీరియాడిక్ వార్ డ్రామాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఫౌజీ’ షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రభాస్ విరామం తీసుకోకుండా ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ అనుకున్న సమయానికి ‘ఫౌజీ’ని పూర్తి చేసి డిసెంబర్ రేసులో నిలుస్తాడో లేదో వేచి చూడాలి.