Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను, భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఇంతటి స్టార్డమ్ వచ్చినా ఆయనలో గర్వం కనిపించదని, చాలా సింపుల్‌గా ఉండటం ప్రభాస్ ప్రత్యేకత అని ఆయనతో పనిచేస్తున్నవారు తరచూ చెబుతుంటారు. ఇదే విషయాన్ని మరోసారి ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
‘స్పిరిట్’ టైటిల్ అనౌన్స్మెంట్ సమయంలో ప్రభాస్ పేరుకు ముందు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను ఉపయోగించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ట్యాగ్‌పై అప్పట్లో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది.అయితే ఈ విషయంలో ప్రభాస్ ఎలా స్పందించారనే దానిపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. టైటిల్ ఆవిష్కరణకు ముందే ఈ విషయాన్ని ప్రభాస్‌తో చర్చించామని ఆయన తెలిపారు. దానికి ప్రభాస్ చాలా క్యాజువల్‌గా “మీ ఇష్టం డార్లింగ్” అంటూ సమాధానం ఇచ్చారని చెప్పారు. ప్రభాస్ ఇచ్చిన ఆ చిన్న సమాధానమే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని నిర్మాత పేర్కొన్నారు. తనపై ఎలాంటి ట్యాగ్ పెట్టినా పట్టించుకోకుండా, మేకర్స్‌పై నమ్మకంతో ముందుకు సాగడం ఆయన స్వభావమని తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’తో పాటు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’ కూడా ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్ షెడ్యూళ్ల మధ్య ప్రభాస్ ఎంతో ఫ్లెక్సిబుల్‌గా వ్యవహరిస్తున్నారని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ‘ఫౌజీ’ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ పూర్తిస్థాయిలో ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని వెల్లడించారు. భిన్నమైన మేకింగ్ స్టైల్ ఉన్న రెండు సినిమాలకు డేట్స్ కేటాయిస్తూ ప్రభాస్ అద్భుతంగా సమన్వయం చేసుకుంటున్నారని నిర్మాత ప్రశంసించారు. తాము నిర్మాతలుగా విజయాలు సాధించడానికి మరో ముఖ్య కారణం దర్శకులకు ఇచ్చే పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ అని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు.దర్శకుడి కథ, విజన్‌లో నిర్మాతలు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా.. “సినిమా నీది, నీ విజన్, నీ ఆలోచన.. నీకు నచ్చినట్లు చేయి” అనే స్వేచ్ఛ ఇస్తామని ఆయన చెప్పారు. దర్శకుడు అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించేందుకు పూర్తి సహకారం అందిస్తామని వివరించారు.