Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచగా.. ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నారు. ‘పెద్ది’ కోసం భారీ స్థాయిలో జాతీయ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్లాన్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో నిర్వహించే గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్‌ను కేవలం సినిమా ఈవెంట్‌గా కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రచార కార్యక్రమంగా మలచాలని చిత్రబృందం భావిస్తోంది. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేలా ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ట్రైలర్ లాంచ్‌తో ప్రమోషన్స్ ఆగిపోవడం లేదు. సినిమా కథలోని భారతీయ మూలాలను సెలబ్రేట్ చేసేలా మేకర్స్ మే 23న భోపాల్‌లో ప్రత్యేక సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన భోపాల్‌లో ఈ వేడుకను అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నిలవనున్నారు. ‘పెద్ది’ చిత్రానికి సంగీతం అందిస్తున్న రెహమాన్ స్వయంగా వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ‘సౌండ్ ఆఫ్ పెద్ది’ పేరుతో ప్రత్యేక మ్యూజికల్ ప్రెజెంటేషన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రెహమాన్‌తో పాటు పలువురు ప్రముఖ గాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ లుక్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తుండగా, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘పెద్ది’ ఇప్పటికే రికార్డుల వేట మొదలుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ప్రీ-సేల్స్‌కు భారీ స్పందన లభిస్తోందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని జూన్ 4, 2026న విడుదల చేయనుండగా.. జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.