Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకున్న బుచ్చిబాబు, కొంత గ్యాప్ తర్వాత ‘పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు రానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
మొదటగా ఈ సినిమాను మార్చి 27న, అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాలతో రిలీజ్‌ను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ మూవీ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ ‘పెద్ది’ కొత్త విడుదల తేదీని జూన్ 26 కి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.’మా సినిమాను జూన్ 26న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ఆ తేదీన ‘పెద్ది’ మూవీ రిలీజ్ కాబోతోంది’ అని ఎస్కేఎన్ చెప్పడంతో మెగా అభిమానులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం మూవీ వాయిదా పడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక ఐటమ్ సాంగ్‌తో పాటు మరో పాట చిత్రీకరణ పెండింగ్‌లో ఉందని సమాచారం.
మరోవైపు ఇటీవల రామ్ చరణ్ కంటికి గాయం కావడం కూడా షూటింగ్ ఆలస్యానికి కారణమైంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ అన్ని పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమవుతుందని తెలుస్తోంది. ‘పెద్ది’ రిలీజ్ డేట్ మార్పు ఇతర సినిమాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా జూన్ 26న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ‘పెద్ది’ అదే సమయంలో వస్తే, ఆ చిత్రం మే 1కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇక నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ‘స్వయంభు’, అలాగే తరుణ్ భాస్కర్ రూపొందిస్తున్న ‘గాయపడ్డ సింహం’ సినిమా కూడా ‘పెద్ది’ తర్వాత రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరోసారి వాయిదా పడుతుందనే వార్తలు మెగా అభిమానుల్లో నిరాశ కలిగిస్తున్నప్పటికీ, సినిమా క్వాలిటీ కోసం సమయం తీసుకోవడం మంచిదేనని కొందరు భావిస్తున్నారు.