Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి పాల్గొన్న ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో షూటింగ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ డెడికేషన్ గురించి బుచ్చిబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమా కోసం చరణ్ మూడు వేర్వేరు బాడీ ట్రాన్స్ఫార్మేషన్స్ చేశారని తెలిపారు. క్రికెటర్ లుక్, ట్రైబల్ లుక్, రెజ్లర్ లుక్ కోసం ఆయన తీవ్రంగా శ్రమించారని చెప్పారు. దీనిపై స్పందించిన చరణ్.. “నువ్వు రాసిన కథతో నేను ప్రేమలో పడ్డాను. అంత మంచి కథ కోసం ఎంత కష్టపడినా తక్కువే. ఎండల్లో, ఇసుకలో షూటింగ్ చేయడం చాలా కష్టం అయినా, ప్రాసెస్‌ను ఆస్వాదించడంతో ఆ శ్రమ పెద్దగా అనిపించలేదు” అని తెలిపారు.
అయితే రెజ్లింగ్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రం తనకు చాలా కఠినంగా మారిందని చరణ్ వెల్లడించారు. “నన్ను అన్ని రకాల బాడీ ట్రాన్స్ఫార్మేషన్స్ చేయించడానికి బుచ్చిబాబు చాలా కష్టపెట్టాడు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని కూడా రామ్ చరణ్ గుర్తుచేసుకున్నారు. కరోనా సమయంలో తాను కొంత మానసికంగా డౌన్ ఫీల్ అయ్యానని, ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలయ్యే సమయంలో కూడా మునుపటి ఉత్సాహం లేదని చెప్పారు. ఆ సమయంలో దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహా తనలో మళ్లీ ఉత్సాహాన్ని నింపిందని వెల్లడించారు. “పెద్ద లక్ష్యాల కంటే చిన్న పనులతో మొదలుపెట్టు. చిన్న విజయాలే పెద్ద మోటివేషన్ ఇస్తాయి” అని రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు.
సినిమాలోని కుస్తీ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతూ, బుచ్చిబాబు యాక్టింగ్ తెలిసిన జూనియర్ ఆర్టిస్టుల కంటే నిజమైన రెజ్లర్లనే తీసుకొచ్చారని చరణ్ చెప్పారు. “వాళ్లు కెమెరా కోసం నటించలేదు. నిజంగానే మ్యాచ్ ఆడినట్టుగా నాపై దాడి చేసేవారు. సీన్ సహజంగా రావడం కోసం నేను కూడా వాళ్లతో అంతే తీవ్రంగా పోరాడాల్సి వచ్చేది” అని తెలిపారు.ఈ రియల్ ఫైట్స్ వల్ల తాను తీవ్ర గాయాలు కూడా ఎదుర్కొన్నట్లు చరణ్ వెల్లడించారు. “చివరి 25-30 రోజుల కుస్తీ షెడ్యూల్ చాలా కఠినంగా సాగింది. షూటింగ్ సమయంలో కంటికి బలమైన దెబ్బ తగిలి దాదాపు నాలుగు కుట్లు పడ్డాయి. అలాగే చేతికి కార్టిలేజ్ టియర్ కూడా అయ్యింది. చేతులకు వచ్చిన నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే షూటింగ్ పూర్తయిన తర్వాత నా కూతురిని కూడా ఎత్తుకోలేకపోయాను. ఇప్పటికీ ఆ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఎక్స్‌రే కూడా చేయించుకోవాలి” అని భావోద్వేగంగా చెప్పారు.