Pawan Kalyan | తెలుగు చిత్రసీమకు మెగాస్టార్‌గా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక రోజున జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్ననాటి నుంచి చిరంజీవి తనకు కేవలం అన్నయ్య మాత్రమే కాదని, ఎప్పటికీ తన హీరోనే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిరంజీవి కళాశాల చదువుల కోసం నర్సాపూర్ వెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటూ, వేసవి సెలవుల్లో ఆయన ఇంటికి రావడం తమ కుటుంబానికి పండగలా ఉండేదని తెలిపారు. తిరిగి చదువుల కోసం వెళ్లిపోయినప్పుడు ఇంట్లో ఒక వెలితి కనిపించేదని, ఆయన తిరిగి వచ్చే వరకు ఆ ఆనందం ఉండేది కాదని భావోద్వేగంగా రాశారు.
తన పాఠశాల రోజుల నుంచే అన్నయ్యపై తనకు ఎంతో గర్వం ఉండేదని పవన్ తెలిపారు. చిరంజీవి ఇంకా హీరో కాకముందే తన దృష్టిలో ఆయన హీరో అని చెప్పారు. పొడవాటి జుట్టు, బెల్‌బాటమ్ ప్యాంట్, కళ్లద్దాలు ధరించి తమ తండ్రి బుల్లెట్ బైక్ నడుపుతూ కనిపించే చిరంజీవిని చూసిన క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేనివని పేర్కొన్నారు. చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన సందర్భంగా తమ కోసం తెచ్చిన బహుమతులను కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. పెద్ద నీలిరంగు బ్యాగ్‌లో తన కోసం తీసుకొచ్చిన చిన్న లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, పెర్ఫ్యూమ్లు వంటి బహుమతులు తన చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేకంగా నిలిచిపోయాయని చెప్పారు. చిరంజీవి ఎప్పుడూ తమ ఇంటికి ఆనందాన్ని, చిరునవ్వులను తీసుకొచ్చేవారని తెలిపారు.
చిరంజీవి పెళ్లి చేసుకున్న సమయంలో అన్నయ్య తమకు దూరమవుతారేమోనని తాను ఆందోళన చెందిన విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఒక గదిలో నిశ్శబ్దంగా ఏడుస్తున్న తనను గమనించిన చిరంజీవి, తన భార్యను తీసుకొచ్చి సరదాగా పరిచయం చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా చిరంజీవి, ఆయన సతీమణి తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను మాటల్లో చెప్పలేనని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయన పడిన శ్రమను తాను దగ్గర నుంచి చూశానని పవన్ కళ్యాణ్ తెలిపారు. చెన్నై ఎండ, ఉక్కపోతలో గంటల తరబడి షూటింగ్‌లు చేసి, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇంటికి చేరుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. నిలబడటానికి కూడా శక్తి లేకపోయినా చిరంజీవి తన పనిపై చూపిన అంకితభావం తనను ఎప్పుడూ ఆశ్చర్యపరిచేదని అన్నారు.
తన చదువులో ఎదురైన వైఫల్యాలు, జీవితంలో తాను దిశా నిర్దేశం లేకుండా ఉన్న సందర్భాల్లో కూడా చిరంజీవి తనను ఎప్పుడూ విమర్శించలేదని పవన్ పేర్కొన్నారు. తన కుటుంబం, బంధువులు మాత్రమే కాకుండా స్నేహితులు, నిర్మాతలు, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరిపై చిరంజీవి తన ప్రేమను, ఉదారతను పంచారని కొనియాడారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా చిరంజీవి కీలక పాత్ర పోషించారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. సాంకేతికతపై ఆసక్తి, దాతృత్వం, కుటుంబంపై ప్రేమ, నటుడిగా సాధించిన అపారమైన విజయాలు.. కేంద్ర మంత్రిగా నిర్వహించిన బాధ్యతలు.. జాతీయ పురస్కారాలు, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు అందుకున్నప్పటికీ ఆయనలో పనిచేయాలనే తపన మాత్రం ఎప్పుడూ తగ్గలేదని పేర్కొన్నారు.
ఇటీవల ఆరోగ్యపరమైన చికిత్స తర్వాత కూడా చిరంజీవి ఎంతో వేగంగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లకు వెళ్లడం ఆయనలోని అద్భుతమైన శక్తికి నిదర్శనమని పవన్ అన్నారు. “నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే, ఆయన కూడా ఎప్పుడూ విశ్రమించరు. అందుకే ఆయన మా ప్రియమైన మెగాస్టార్.. నాకు మాత్రం ఎప్పటికీ నా ఏకైక హీరో” అంటూ పవన్ తన అన్నయ్యపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. చివరగా చిరంజీవి జీవితంలో అపారమైన ఆరోగ్యం, అద్భుతమైన శక్తి, మరెన్నో విజయాలు కలగాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు చిరంజీవి పుట్టినరోజు కేవలం ఒక లాంఛనం కాదని, ఆయన జీవితం తనతో పాటు లక్షలాది మందికి ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు. “నా ప్రియమైన అన్నయ్య.. ప్రకృతి నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి. జై హింద్” అంటూ పవన్ కళ్యాణ్ తన ఎమోషనల్ సందేశాన్ని ముగించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for… pic.twitter.com/oWMPairQY1
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2026