ఫాంటసీ కథాంశంతో రూపొందించిన తమిళ చిత్రం ‘వినోదాయ సీతాం’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రీమేక్ చేయబోతున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిని ధృవీకరించారు చిత్ర నటుడు, దర్శకుడు సముద్రఖని. తాను పవన్‌కల్యాణ్ అభిమానినని, ఆయన ఇమేజ్‌కు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తానని సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మరణించిన ఓ వ్యక్తికి దేవుడు పునర్జన్మనిస్తాడు. మూడు నెలల పాటు జీవితాన్ని గడిపేందుకు అవకాశమిస్తాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందన్నదే చిత్ర కథ. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ దేవుడి పాత్రలో నటించనున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.