సినీ ఇండస్ట్రీ (Cine Industry)లో హీరోల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరి ఈవెంట్స్ కు మరొకరు వెళ్తూ ఉంటారు. ఒకరి సినిమా షూటింగ్ లొకేషన్లోకి మరొకరు వెళ్లి సందడి చేస్తుంటారు. అయితే కొందరు ముందుగా సమాచారం ఇచ్చి షూటింగ్ స్పాట్‌కు వెళ్తే..మరికొందరేమో సర్ప్రైజ్ ఇస్తుంటారు. ఇపుడు అలాంటి సర్ప్రైజే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కు ఇచ్చాడట.
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి ప్రాజెక్టు కే (Project K). కొన్ని నెలల క్రితం షూటింగ్ షురూ కాగా…ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరణ కొనసాగుతుంది. తాజా అప్ డేట్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్‌బచ్చన్, ప్రభాస్‌లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుందట నాగ్ అశ్విన్ అండ్ టీం.
అయితే రామోజీ ఫిలిం సిటీలోనే భీమ్లా నాయక్ షూటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్..విరామ సమయంలో ప్రాజెక్టు కే లొకేషన్ వెళ్లి..ప్రభాస్, బిగ్ బీకి సర్ప్రైజ్ ఇచ్చాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా చేశాడట పవన్. మొత్తానికి ముగ్గురు స్టార్ హీరోలు ఇలా ఒక్కచోట కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారన్న న్యూస్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.