చిత్రం: పాంచాలి పంచభర్తృక
నటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పృధ్వీరాజ్, సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు
దర్శకత్వం: గంగా సప్తశిఖర
సంగీతం: మహేష్ నారాయణ, బ్షేక్
నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్ కోసర్ల
ఎడిటర్: జానీ బాషా నాగ
‘పాంచాలి పంచభర్తృక’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో పాటు లెజెండరీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీరాజ్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తుండటంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచాయి. ప్రస్తుతం టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండగా, ఈ జోనర్‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో సమీక్షలో చూద్దాం.
కథ
డాక్టర్ దమయంతిని డాన్సన్ మనుషులు అపహరిస్తారు. ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టాలంటే తమ అక్రమ బిజినెస్‌లో సహకరించాలని బెదిరిస్తారు. మరోవైపు, సీరియల్స్ డైరెక్టర్ అయిన చిత్తరంజన్ (జెమిని సురేష్) వెండితెరపై సినిమా తీయాలనే కలతో సతమతమవుతుంటాడు. అద్దె ఇల్లు వెతుకుతున్న కాట్రాజ్, పుష్పరాజ్‌లు చిత్తరంజన్‌ను కలవగా, ఆయన తన అపార్ట్మెంట్లోని పెంట్‌హౌస్‌లో కలిసి ఉండమని ఆహ్వానిస్తాడు. అలా నలుగురూ ఒకే గొడుగు కిందకు వస్తారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీని తమ మాటలతో బుట్టలో వేసుకుని నలుగురూ ఒక జట్టుగా మారుతారు. సరదాగా గడపడం కోసం ఆన్లైన్ ద్వారా ‘సెనోరిటా’ అనే అమ్మాయిని సంప్రదిస్తారు. ఆ తర్వాత నలుగురూ ఒక అత్యవసర పనిపై బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఆ అమ్మాయి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటుంది. ఆ శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని సూట్‌కేస్‌లో సర్దుకుంటారు. అయితే అనూహ్యంగా ఆ సూట్‌కేస్ కూడా మాయమవుతుంది.
అసలు ఆ శవంతో ఉన్న సూట్‌కేస్ ఏమైంది? పరమసుందరిగా నటించిన రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమిటి? రోజ్మేరి ఎవరు? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో (దర్శకుడు గంగా సప్తశిఖర) ఏం చేశాడు? చివరికి హత్య ఎవరు చేశారనే అసలు నిజం తెలియాలంటే తెరపై ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమా ప్రారంభంలోనే ప్రముఖ నటుడు సునీల్ వాయిస్ ఓవర్ ద్వారా పాత్రలను పరిచయం చేసే విధానం ఎంతో వినూత్నంగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక పాత్రల పేర్లు కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. కథ, కథనాల పరంగా దర్శకుడు చాలా స్పష్టతతో వ్యవహరించారు. నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని ఆహ్వానించడం, అనుకోని రీతిలో ఆమె హత్యకు గురికావడం, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారనే ఉత్కంఠను క్లైమాక్స్ వరకు దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, కడుపుబ్బా నవ్విించే కామెడీ సన్నివేశాలు, మర్డర్ ఎపిసోడ్‌తో సరదాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు హంతకుడు ఎవరనే కోణంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా వరుస చిక్కుముడులను విప్పిన విధానం మెప్పిస్తుంది.
సినిమా ముగింపులో వచ్చే రెండు ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. థ్రిల్లర్ జోనర్‌కు సరిపడా కామెడీని జోడించిన తీరు బాగుంది. ఎక్కడా అసభ్యత లేదా క్రింజ్ కామెడీకి తావులేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా తెరకెక్కించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండటం ఈ చిత్రానికి మరో ప్రధాన బలం.
నటీనటుల ప్రతిభ
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పృధ్వీరాజ్ తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను తమ భుజస్కంధాలపై మోశారు. వారిద్దరి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెమిని సురేష్ కీలకమైన పాత్రలో ఒదిగిపోయి చక్కటి అభినయం కనబరిచారు. రోల్ రైడా, సరీహ్ ఫార్, రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి: తమ పరిధి మేరకు అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నిర్మాతగా వ్యవహరిస్తూనే కీలక పాత్ర పోషించిన రాజ్ పవన్.. నటనలో కొత్తవారైనా ఎక్కడా తడబడకుండా పరిణతితో నటించారు.
సాంకేతిక విభాగం
దర్శకత్వం: దర్శకుడు గంగా సప్తశిఖర ప్రతిభ ఈ సినిమా విజయంలో స్పష్టంగా కనిపిస్తుంది. నూతన దర్శకుడైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించారు. సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలుగా ఆయన చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది.
స్క్రీన్‌ప్లే: సినిమాకు ఇదే అసెట్. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.
సంగీతం: టైటిల్ సాంగ్ ఎనర్జిటిక్‌గా ఉంది. మిగిలిన పాటలు కథాంశానికి తగినట్లుగా సాగిపోతాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ మూడ్‌ను ఎలివేట్ చేసింది.
ఎడిటింగ్, నిర్మాణం: జానీ బాషా నాగ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. అనవసరమైన సాగదీతలు లేకుండా సినిమాను క్రిస్పిగా నడిపించారు. అమెరికా నుంచి వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్ కోసర్ల అనుసరించిన నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు
ఆసక్తికరమైన కథ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
రాజేంద్ర ప్రసాద్, పృధ్వీరాజ్ కామెడీ టైమింగ్
ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్లు
తెలిసిన కథలా ఉండడం
అక్కడక్కడ సన్నీవేశాలు
తుది తీర్పు
‘పాంచాలి పంచభర్తృక’ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్లను, కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఒక చక్కటి విందు భోజనం లాంటిది. ఎలాంటి బోర్ కొట్టకుండా చివరి వరకు ఉత్కంఠను మైంటైన్ చేస్తూనే నవ్వులు పండిస్తుంది. వీకెండ్లో సరదాగా థియేటర్లో ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ మూవీ.
రేటింగ్: 3 / 5