మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రీకర్కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మౌనికా డాకోజు కథానాయికగా నటిస్తున్నది. ఇటీవల ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాత, తండ్రి మార్గం విప్లవమైతే, మూడోతరం నుంచి వచ్చిన సన్నీ ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాడని అన్నారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే కథాంశమిదని, ఆద్యంతం వినోదభరిత ప్రేమకథగా మెప్పిస్తుందని దర్శకుడు శ్రీకర్కృష్ణ తెలిపారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సామి, సంగీతం: ఇషాక్ వలి, రచన-నిర్మాత, దర్శకత్వం: శ్రీకర్కృష్ణ.