‘అమలగారు లేకుండా ఈ సినిమాను ఊహించలేను. ఆమెతో కలిసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదు. ఇది నా వాగ్ద్దానం’ అని అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తీక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. నేడు విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని అమల మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించడం ఓ గొప్ప అనుభవం. బెంగాల్లో పుట్టిన నన్ను తెలుగు కోడలిగా స్వీకరించి ఇక్కడి ప్రజలు ఎంతగానో ఆదరించారు.
మనసుకు హత్తుకునే సినిమా ఇది. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. మీ కుటుంబాలతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా కథలో తల్లీకొడుకుల ప్రయాణం హృదయాల్ని కదిలిస్తుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో చక్కటి భావోద్వేగాలతో సాగే చిత్రమిది. అమలగారు ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. శర్వానంద్ తన నటనతో ప్రాణం పోశారు’ అని దర్శకుడు తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం హృద్యంగా ఉంటుందని నిర్మాత ఎస్.ఆర్.ప్రభు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.