అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. విద్యాసాగర్ దర్శకుడు. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, క్రిష్ సమర్పకులు. సెప్టెంబర్ 3న విడుదలకానుంది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. చిత్ర సమర్పకుడు, దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ “కంచె’ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతున్నప్పుడు శ్రీనివాస్ అవసరాల ఈ కథ చెప్పాడు. మనుషుల్లో ఉండే అభద్రతాభావం అనే పాయింట్‌ను వినోదాత్మకంగా చూపిస్తానని అన్నాడు. అప్పటి కథ నేడు సినిమాగా ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం అవసరాల శ్రీనివాస్ ఐదారునెలలు గుండుతోనే ఉన్నాడు. వినోదంతో పాటు మంచి అర్థం ఉన్న సినిమా ఇది’ అన్నారు. ప్రతి ఒక్కరిని నవ్వుల్లో ముంచే చిత్రమిదని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనలో ఉండే అభద్రతాభావాల్ని వదిలిపెట్టాలని ఈ సినిమాలో చెప్పాం. జీవితాల్ని దగ్గరి నుంచి చూస్తున్నట్లు అనిపిస్తుంది’ అన్నారు. స్క్రిప్ట్ వినగానే ఉద్వేగంగా ఫీలయ్యానని రుహానీశర్మ చెప్పింది.