Nilave Movie | టాలీవుడ్లో ఇటీవల కాలంలో చిన్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యపరుస్తున్నాయి. అదే కోవలో ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నిలవే’. సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ చిత్రం నేడు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
అర్జున్ (సౌమిత్ రావు) ఒక అనాథ. తన స్నేహితుడు (హర్ష చెముడు) ఇంట్లోనే ఉంటూ ఒక యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. జీవితంలో తోడు కోసం తపించే అర్జున్, అనుకున్నది జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురు అపార్ట్మెంట్లో ఉండే అతిథి (శ్రేయాసి సేన్) అతనికి కనిపిస్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన అర్జున్, ఆమెకు దగ్గరవుతాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినప్పటికీ, అతిథి మాత్రం అర్జున్ ప్రేమను అంగీకరించడానికి వెనకడుగు వేస్తుంది. అసలు అతిథి గతం ఏమిటి? అర్జున్ కలలు కన్నట్లుగా ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకోగలిగాడా? వీరిద్దరి జీవితాల్లోకి వచ్చిన మార్పులేమిటి? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం ఒక సున్నితమైన ప్రేమకథను సంగీతంతో ముడిపెట్టి తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. సినిమా ప్రారంభమే ఆత్మహత్య సన్నివేశంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. ఒంటరితనం ఒక మనిషిని ఎంతలా కుంగదీస్తుందో అర్జున్ పాత్ర ద్వారా దర్శకులు చక్కగా చూపించారు. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం రొమాంటిక్ మోడ్‌లోకి మారుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. సెకండాఫ్ అంతా ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్లు అనిపించినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.
నటీనటులు
అర్జున్ పాత్రలో సౌమిత్ రావు అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సీన్లలోనే కాకుండా, డ్యాన్స్‌ల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. తెరపై ఆయన లుక్ చాలా బాగుంది. హీరోయిన్ పాత్రలో శ్రేయాసి తన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరగడంతో, కథలోని లోతును పండించడంలో ఆమె సఫలమైంది. వైవా హర్ష తనదైన కామెడీతో కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు ప్రధాన బలం కళ్యాణ్ నాయక్ అందించిన నేపథ్య సంగీతం. పాటలు మెలోడియస్గా ఉండి కథలో లీనమయ్యేలా చేస్తాయి. దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు:
హీరో హీరోయిన్ల నటన.
నేపథ్య సంగీతం మరియు పాటలు.
క్లైమాక్స్ సన్నివేశాలు.
దర్శకుల టేకింగ్.
మైనస్ పాయింట్లు:
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సన్నివేశాలు.
ముగింపు:
ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు ‘నిలవే’ ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. ఒక స్వచ్ఛమైన ప్రేమకథను, భావోద్వేగాలతో చూడాలనుకునే వారు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.
రేటింగ్: 3/5