Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం మల్టీ స్పోర్ట్స్ నేపథ్యంతో ప్రత్యేకంగా రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయిందని, ఒక పాట మినహా మిగతా భాగం ముగిసినట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం ఆ చివరి పాట చిత్రీకరణ కొనసాగుతుండగా, విడుదల తేదీపై కూడా స్పష్టత వస్తోంది. ముందుగా జూన్‌లో సినిమా విడుదల అవుతుందని ప్రకటించిన మేకర్స్, ఖచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు.
తాజా సమాచారం ప్రకారం, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఉండటంతో జూన్ 4న సినిమా విడుదల కష్టమని తెలుస్తోంది. దీంతో జూన్ 25ను విడుదల తేదీగా నిర్ణయించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే జూన్ 24 రాత్రి నుంచే ప్రీమియర్ ప్రదర్శనలు కూడా ఉండే అవకాశముంది. ఈ విడుదల తేదీపై చిత్రబృందం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అభిమానులు మాత్రం ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో భావోద్వేగాలను కలిపి రూపొందుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తనదైన శైలిలో కథను తెరకెక్కిస్తున్నందున ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘పహిల్వాన్ గ్లింప్స్’కు తోడు ఏఆర్ రెహమాన్ అందించిన ‘చికిరి చికిరి’, ‘రేయ్ రేయ్ రా’ వంటి పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. తాజాగా ఈ చిత్రంలో ఉండబోయే హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ని ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.