Neelira | తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో, నవీన్ చంద్ర, సనంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘నీలిర’. ఈ చిత్రం ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే..1988 నాటి శ్రీలంక అంతర్యుద్ధం (Civil War) నేపథ్యంలో సాగే చిత్రమని తెలుస్తుంది. కథ ఒక సందడిగా సాగే వివాహ వేడుకతో మొదలై, ఒక్కసారిగా యుద్ధం సృష్టించిన బీభత్సం వైపు మళ్లుతుంది. మారణహోమం మధ్య ఒక కుటుంబం ఎదుర్కొన్న ప్రాణభయం, మనుగడ కోసం వారు పడ్డ ఆవేదన మరియు అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని దర్శకుడు సోమీధరన్ వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించారు.
ఈ సినిమాలో నవీన్ చంద్ర తన నటనతో ఆకట్టుకోగా, సనంత్, రూప కొడువాయూర్ మరియు కపిల వేణు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ‘K’ అందించిన నేపథ్య సంగీతం ఈ యుద్ధ వాతావరణానికి మరింత బలాన్ని చేకూర్చింది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పతాకంపై కార్తికేయన్ సంతానం, కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఇటీవల జరిగిన సినిమా వేడుకకు వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్ మరియు ఏఆర్ మురుగదాస్ వంటి దిగ్గజ దర్శకులు హాజరై, యుద్ధం వెనుక ఉన్న సామాన్య మనుషుల బాధలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.