Nayanthara next with Lawrence | లేడీ సూపర్ స్టార్ నయనతార రెండు దశాబ్దాలుగా సౌత్‌ను ఏలుతుంది. ఇప్పటికీ సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే. స్టార్ హీరోలతోనే నటించాలి, ఒకే జానర్లో సినిమాలు చేయాలి అని మడి కట్టుకుని కూర్చొకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రతీ ఏడాది ఖచ్చితంగా నయనతార నుంచి మూడు, నాలుగు సినిమాలైనా వస్తుంటాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో షారుఖ్‌తో కలిసి నటించిన జవాన్ వచ్చే వారం రిలీజ్ కాబోతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ లారెన్స్‌తో జోడీ కట్టబోతుంది. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే హార్రర్ సినిమాలో రాఘవ లారెన్స్‌కు జోడీగా ఈ బ్యూటీ నటించబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక నయన్ ఇటీవలే ఇన్‌స్టాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిందో లేదో మిలియన్లలో ఫాలోవర్స్ వచ్చి చేరారు. పెళ్లయ్యాక కూడా నయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెగ బిజీగా గడుపుతుంది.
ఇక లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి-2 ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. పద్దెనిమిదేళ్ల కిందట వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడదే సినిమాకు దర్శకుడు పి. వాసు సీక్వెల్‌ను రూపొందించాడు. కంగానా రనౌత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి స్వరాలందించాడు.