బాగా డబ్బుంటే.. సెలెబ్రిటీ లక్షల మంది గుర్తు పట్టేంత ఫేమ్ ఉంటే.. సెలెబ్రిటీ నలుగురికీ సాయం చేసే మనసు కూడా ఉంటే.. అసలైన సెలెబ్రిటీ.. పాతికేండ్ల నవ్యా నవేలీ నంద ఈ మూడు కోవల్లోనూ ఉంది. అందుకే నవ్యకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. తాత అమితాబ్కూ, ముత్తాత రాజ్ కపూర్‌కూ, తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యానికే కాదు.. ఆడవాళ్ల పట్ల వివక్షలేని ప్రపంచానికి కూడా ఆమె ప్రతినిధే!
Navya Naveli Nanda | ఎక్కడ పుట్టామన్నది కొంతమందిని సెలెబ్రిటీలను చేస్తుంది. కానీ, ఎలా ఆలోచించామన్నది ఇంకొంత మందిని సెలెబ్రిటీలుగా నిలబెడుతుంది. నవ్యా నవేలీ నందను జనం రెండో రకం వ్యక్తిగానే గుర్తిస్తారు. సంపన్న కుటుంబంలో పుట్టినా ఆమె ఆలోచనలన్నీ సమాజం గురించే! తన చుట్టూ ఉన్న ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష ఆమెను బాధించింది. అందుకే చదువు పూర్తవుతూనే లింగవివక్షను రూపు మాపే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ నవేలీ’ని ప్రారంభించింది. ఆడపిల్లల కెరీర్‌కు ఊతమిచ్చేలా మరో ఎన్జీవోనూ నెలకొల్పింది. పోడ్కాస్ట్, పుస్తకాలు… ఇలా ఏం చేసినా ఆమె లక్ష్యం ఆడవారిని ఒక మెట్టు ఎక్కించాలన్నదే.
స్టార్ కిడ్
అమితాబ్, జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ గారాలపట్టి నవ్య. తండ్రి నిఖిల్ నంద… వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, నిర్మాణ రంగానికి సంబంధించిన మెషీన్లు తయారుచేసే బహుళజాతి సంస్థ ఎస్కార్ట్స్ కుబొట గ్రూపునకు యజమాని. లండన్‌లో పాఠశాల చదువు పూర్తిచేసిన నవ్య, న్యూయార్క్ ఫోడమ్ యూనివర్సిటీ నుంచి డిజిటల్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చదివింది. నవ్య ఆలోచనా విధానం తొలినుంచీ భిన్నమే. తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడే ఆమె, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉండేది. తను పుట్టిన కుటుంబం అన్ని విధాలా ఆమెకు వెన్నుదన్నుగా ఉంది సరే… కానీ తనలాంటి ఆడపిల్లలు ఎందరో వివక్షను ఎదుర్కొంటున్నారని గమనించింది. స్త్రీ పురుషులన్న భేదం లేకుండా అందరూ సమానమైన గౌరవం, అవకాశాలు పొందేందుకు తన వంతు సాయం అందించాలనుకుంది.
నవేలీతో మొదలు
లింగవివక్షను నిర్మూలించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ నవేలీ పేరిట ఒక ఎన్జీవోను ప్రారంభించింది నవ్య. దీని ద్వారా విద్య, ఆరోగ్యం, చట్టాల పట్ల అవగాహన, న్యాయ సేవ, ఆంత్రప్రెన్యూర్‌షిప్ తదితర అంశాల మీద మహిళలకు సేవలందిస్తున్నది. ఇందుకోసం వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. ఇందులో భాగంగానే ఆంత్రప్రె‘నారి’ పేరిట మహిళలను వ్యాపారవేత్తలుగా చేసే ప్రాజెక్ట్‌ను చేపట్టింది.
దీని ద్వారా పేద మధ్య తరగతికి చెందిన 25,000 మందికి పైగా నడి వయసు మహిళలు, గృహిణులు వివిధ వ్యాపారాలను ప్రారంభించారు. వీళ్లకు కావలసిన వసతులతోపాటు, యాడ్ ఏజెన్సీలు, లీగల్ ఫామ్‌ల సేవలను ఉచితంగా అందిస్తున్నారు. మహారాష్ట్రలోని మారుమూల పల్లెల్లో ‘పీరియడ్ పాజిటివ్ హోమ్స్’ పేరిట నెలసరి సమయంలో మహిళలు ఉండేందుకు వీలుగా భద్రమైన, శుభ్రమైన ఇండ్లను నిర్మించారు. నీరు, కరెంటు, మంచాలు, శానిటరీ న్యాప్కిన్లు వాటిలో అందుబాటులో ఉంచారు. ఖాళీ సమయంలో వినియోగించుకునేలా కుట్టు మెషీన్లు ఏర్పాటుచేశారు.
మహిళలకు న్యాయ సలహాలు అందించేందుకు పనిచేస్తున్న న్యాయ్రి సంస్థతో కలిసి తెలంగాణ సహా వివిధ రాష్ర్టాల్లో పలు సేవలు అందిస్తున్నది నవ్య బృందం. నిమయ ఫౌండేషన్ పేరిట ఈమె స్థాపించిన మరో సంస్థ పెద్ద కలలున్న పేద ఆడపిల్లలకు వాటిని నిజం చేసుకునేందుకు కావలసిన నైపుణ్యాలను నేర్పిస్తున్నది. కెరీర్ యాక్సెలరేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తూ ఎందరో ఆడపిల్లలను తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఉపకరిస్తున్నది. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ టింకిల్‌తో కలిసి ‘వండర్ నారి’ పేరిట మహిళా సాధికారతకు సంబంధించిన కామిక్ పుస్తకాన్ని తీసుకువచ్చింది నవ్య. ఇందులో ఉండే నాలుగు కథలు మహిళల మానసిక ఆరోగ్యం, విద్య, ఆంత్రప్రెన్యూర్‌షిప్, చట్టాల పట్ల అవగాహనకు సంబంధించినవే!
వాట్ ద హెల్…
ఆడవాళ్ల జీవితాల్లోని వివిధ అంశాలు, గడచిన ఏండ్లలో జరిగిన మార్పులు, ఇప్పటి పరిస్థితుల పట్ల సరైన అవగాహన రావాలంటే కనీసం మూడు తరాలను అవలోకించాలి. అమ్మమ్మ జయా బచ్చన్, అమ్మ శ్వేతా బచ్చన్ నందతో కలిసి ‘వాట్ ద హెల్ నవ్య’ పేరిట పోడ్కాస్ట్ ప్రారంభించింది నవ్య. తర్వాత వీటిని వీడియోల రూపంలోనూ తీసుకొస్తున్నది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ప్రేమ, పెండ్లి, కెరీర్, పిల్లల పెంపకం… ఇలా వివిధ అంశాలను ఇందులో చర్చిస్తుంటారు. ఇటీవల ఈ కార్యక్రమానికి ఇండియా ఆడియో సమిట్ అండ్ అవార్డ్స్‌లో వివిధ విభాగాల్లో అవార్డులూ వచ్చాయి. నవ్య సోషల్ ఇన్ఫ్లూయెన్సర్. ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే పదిలక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. మొత్తంగా చెప్పాలంటే… పుస్తకాలు మొదలు పోడ్కాస్ట్ దాకా, వ్యాపారం మొదలు సేవ దాకా ఇలా… నవ్య ఏం చేసినా విషయమంతా ఆడవాళ్ల అవసరాలు, అభివృద్ధికి సంబంధించే ఉంటుంది.
‘నేను అన్ని సౌకర్యాలూ, అవకాశాలూ అందుబాటులో ఉన్న గొప్ప కుటుంబంలో పుట్టాను. అనుకున్నది చేసేందుకు నా కుటుంబ సహకారం పూర్తిగా ఉంది. ఇరవై ఏండ్లకే స్వచ్ఛంద సంస్థను స్థాపించినా, వ్యాపారం ప్రారంభించినా… దానివల్లే సాధ్యం అయింది. దానికి తగ్గ గుర్తింపూ వస్తున్నది. కానీ, నాలాగే సమాజం కోసం పనిచేసే ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లను కూడా గుర్తించి వెలుగులోకి తీసుకురావాలి. వాళ్లతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. మరో విషయం… సమాజానికి ఏదైనా చేయాలనిపించినప్పుడు చిన్న వయసు అని ఎవరూ అనుకోకూడదు. ప్రారంభిస్తే తప్పకుండా ముందుకు వెళ్లగలం’ అని చెబుతుంది నవ్య.
సోషల్ ఆంత్రప్రెన్యూర్..
నవ్య తన ఇరవై ఒకటో ఏటనే ఆరా హెల్త్ పేరిట ఒక హెల్త్ టెక్ సంస్థను ప్రారంభించింది. మహిళలకు శరీరం పట్ల అవగాహన కల్పించడం, వారి సమస్యలకు సరైన పరిష్కారాలు చూపడం, వాటికి తగ్గట్టు ఉత్పత్తులను సూచించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీ, లండన్ ఇంపీరియల్ కాలేజీ గైనకాలజీ సొసైటీ సహా ప్రముఖ గైనకాలజిస్టులు, సైకాలజిస్టులు, డెర్మటాలజిస్టులతో కలిసి సేవా క్రతువు నిర్వహిస్తున్నది. అంతేకాదు, పాజిటివ్ ప్రోగ్రామ్స్ విభాగం కింద వివిధ సంస్థలతో కలిసి నెలసరి సమయంలో సరైన వసతులు అందుబాటులో లేని మహిళల కోసం ‘ఎండ్ పీరియడ్ పావర్టీ’ పేరిట డ్రైవ్‌లను చేపడుతూ, పేద మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంచుతున్నది. చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నది. మనదేశంలో సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాననీ, పుట్టుకతో వచ్చిన గౌరవం, గుర్తింపులతో పాటు తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాననీ చెబుతుంది నవ్య.