Honey Movie | మూఢనమ్మకాలు మనిషిని ఎంతటి దారుణాలకు ఒడిగట్టేలా చేస్తాయి? అనే అంశాన్ని వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కించిన చిత్రం ‘హనీ’. ‘పలాస’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను రూపొందించారు. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
ఆనంద్ (నవీన్ చంద్ర) తీవ్రమైన మూఢనమ్మకాలతో బతికే వ్యక్తి. క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను బలంగా నమ్మే అతని ప్రవర్తన వల్ల చివరకు ఉద్యోగం కూడా పోతుంది. ఆనంద్ విపరీత ధోరణి వల్ల అతని భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా నిరంతరం మానసిక క్షోభను అనుభవిస్తుంటారు. ఒక దశలో తన పూజలు ఫలించాలంటే ఊరికి దూరంగా ఉండాలని భావించిన ఆనంద్, కుటుంబాన్ని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ తన కూతురు మీరా ద్వారా ఏదో సాధించవచ్చని భ్రమపడతాడు. అసలు ఆనంద్ తన కూతురితో ఏం చేయించాడు? ఆ క్షుద్ర పూజల వెనుక ఉన్న భయానక నిజాలేంటి? చివరకు ఆ తల్లి-కూతుళ్ల పరిస్థితి ఏమైంది? అనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
మదనపల్లెలో జరిగిన యదార్థ సంఘటనలతో పాటు కొన్ని క్షుద్ర పూజల ఉదంతాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు కరుణ కుమార్ ఈ కథను రాసుకున్నారు. సాధారణ హారర్ సినిమాల్లా దెయ్యాలు, ఆత్మలు కాకుండా.. మనిషిలోని వికృత ఆలోచనలే ఎంతటి భయాన్ని కలిగిస్తాయో ఇందులో చూపించారు. సినిమా ప్రారంభం నుంచే ఒక రకమైన ఉత్కంఠను కలిగిస్తుంది ఈ చిత్రం. అనవసరపు జంప్ స్కేర్స్ లేకుండా కేవలం కథనం ద్వారానే భయాన్ని పుట్టించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా సాగగా, క్లైమాక్స్ ఎమోషనల్ గా ప్రేక్షకులను కుదిపేస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు నెమ్మదించినట్లు అనిపిస్తాయి. సినిమా థీమ్ డార్క్‌గా ఉండటం వల్ల అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.
నటీనటులు:
నవీన్ చంద్ర తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పొచ్చు. ఒక సైకోలాంటి తండ్రి పాత్రలో అతని కళ్ళలో కనిపించే క్రూరత్వం, పిచ్చి అద్భుతం. భార్య పాత్రలో దివ్య పిళ్లై నటన గుండెను హత్తుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో ఆమె నటన హైలైట్. చిన్నారి మీరా తన సహజత్వంతో ఆకట్టుకోగా, దివి మరియు రాజా రవీంద్ర తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం:
అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. నిశ్శబ్దంలో కూడా భయాన్ని పుట్టించే సంగీతం ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ సినిమా మూడ్‌ను ప్రతిబింబించేలా డార్క్ టోన్‌లో అద్భుతంగా ఉంది. కరుణ కుమార్ దర్శకత్వ ప్రతిభ మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది.
చివరి మాట: ‘హనీ’ అనేది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు, సమాజంలోని మూఢనమ్మకాలపై ఒక బలమైన హెచ్చరిక. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన చిత్రమిది.