Nani | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఆయన ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. సామాజికాంశాలను చర్చిస్తూ ఈ సినిమా సాగుతుందని, యథార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం హీరో నాని ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చడంతో పాటు రజనీకాంత్ వంటి అగ్ర నటుడితో తెరను పంచుకునే అవకాశం ఉండటంతో ఈ సినిమాలో నటించడానికి నాని సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ఈ ఏడాది ‘దసరా’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చిత్రంలో నటిస్తున్నారు. తండ్రీకూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.