నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘అంటే సుందరానికీ..’ నజ్రియా నజీమ్ ఫహాద్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. ఈనెల 10న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు.
నాని మాట్లాడుతూ…‘మేము సూపర్‌హిట్ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. దానికి ఏ స్థాయి విజయం అందిస్తారో మీ చేతుల్లో ఉంది. ఏ సినిమా విజయానికైనా కావాల్సినవి యాక్షన్, వినోదం, భావోద్వేగాలు. ఈ ఏడాది చాలా యాక్షన్ చూశాం. ఇక కావాల్సింది హ్యూమర్, ఎమోషన్స్. అవి మా సినిమాలో చూడండి. ఈ సినిమా తర్వాత దీన్ని మించిన చిత్రంలో నటించాలన్నంత ఉత్సాహం కలిగింది’ అని అన్నారు.
‘తెలుగులో నా మొదటి చిత్రమిది. షూటింగ్ ప్రతిరోజూ ఆస్వాదించాను’ అని చెప్పింది నాయిక నజ్రియా ఫహాద్. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ..‘వైజాగ్ వస్తే నా కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. మా సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ఇక్కడికొచ్చాం. మళ్లీ సక్సెస్ మీట్‌కు ఇక్కడికే రావాలనుకుంటున్నాం’ అన్నారు. నదియా, హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి, ఎడిటర్ : రవితేజ గిరిజాల, సీఈఓ: చెర్రీ, సంగీతం : వివేక్ సాగర్.