Nani | న్యాచురల్ స్టార్ నాని జూలై నెలకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రాల్లో నాని కొత్త లాంగ్ హెయిర్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఎడమ చేతి మోచేతికి బ్యాండేజ్ కట్టుకుని కనిపించడం చర్చనీయాంశమైంది. ఫోటోలను పంచుకుంటూ నాని.. “ఘాయల్ హూ… ఇస్లియే ఘాతక్ హూ” అంటూ ‘ధురంధర్’ సినిమాలోని ప్రముఖ డైలాగ్‌ను క్యాప్షన్‌గా జత చేశాడు. గాయమైనప్పటికీ తన ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని, యాక్షన్ సన్నివేశాల కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాననే సందేశాన్ని ఈ పోస్టు ద్వారా అభిమానులకు అందించాడు.
ప్రస్తుతం నాని తన ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
గాయంతో ఉన్నప్పటికీ షూటింగ్‌కు సిద్ధమవుతున్న నాని తాజా పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన కొత్త లుక్‌తో పాటు ‘ది ప్యారడైజ్’పై మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా నాని ది ప్యారడైజ్ చిత్రం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేయాలనే కసితో ఉన్నాడు నాని.