కథాంశాల్లో కొత్తదనానికి పెద్దపీట వేస్తారు హీరో నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ చిత్రంలో మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ప్రస్తుతం నాని ‘దసరా’ విజయాన్ని ఆస్వాదిస్తూనే తన 30వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగనుంది. కథానుగుణంగా ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. అందులో ‘నాన్న’ ‘హాయ్..నాన్న’ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారనే విషయంలో కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందంటున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.