Nandus World Scam | యూట్యూబ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై వీసా మోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్‌లు, వీసా రెన్యూవల్ పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, రమా నందన దంపతులు యునైటెడ్ కింగ్డమ్లో స్థిరపడి జీవిస్తున్నారు. ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ కుటుంబ జీవితం, ప్రయాణాలు, పండుగలు, షాపింగ్, సరదా సంభాషణలు వంటి వీడియోలతో విపరీతమైన ఆదరణ పొందారు. ప్రత్యేకమైన వాయిస్, సహజమైన ప్రెజెంటేషన్‌తో నందనకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్‌కు 28 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ దంపతులపై వీసా స్కామ్ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. వర్క్ పర్మిట్‌కు అవసరమైన స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో 50 మందికిపైగా మోసపోయినట్లు ప్రచారం జరుగుతోంది. యూకేలో వీసాలు జారీ చేసే కొన్ని కంపెనీలతో తమకు సంబంధాలు ఉన్నాయని, మధుకర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని చెప్పి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసు కేసు కూడా నమోదైంది. మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యూకేలో ఉన్న సమయంలో వీసా రెన్యూవల్ కోసం విడతల వారీగా సుమారు రూ.15 లక్షలు చెల్లించినప్పటికీ పని జరగలేదని ఆయన ఆరోపించారు. తన ఫిర్యాదులో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.
మరోవైపు తమపై వస్తున్న ఆరోపణలను నందన కుటుంబం ఖండిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన వీడియోలో తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నందన పేర్కొన్నారు. అయితే వీసా స్కామ్ ఆరోపణలపై మాత్రం ఆమె ప్రత్యక్షంగా స్పందించలేదు. తమ వ్యాపారాలు, కన్సల్టెన్సీ కార్యకలాపాలపై న్యాయవాదుల ద్వారా వివరణ ఇస్తామని తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, యూకేలో ఉద్యోగాలు కోల్పోయిన కొందరు వ్యక్తులే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నందన వర్గం వాదిస్తోంది. అయితే బాధితుల ఆరోపణలు, నమోదైన ఫిర్యాదులు, మరోవైపు నందన కుటుంబం చేస్తున్న ఖండనలు ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.రమా నందన ఇటీవల చిరు నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించి అలరించిన విషయం తెలిసిందే.