Nandini Reddy | తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందిని రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా తెరకెక్కించే దర్శకురాలిగా పేరొందిన ఆమె, తాజాగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే తన ప్రత్యేకమైన కథనం, భావోద్వేగాలను తెరపై చూపించే తీరు ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం ‘జబర్దస్త్’, ‘కల్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు.
ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే మంచి వసూళ్లు సాధించగా, రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల వైరల్ అవుతున్న ఓ పాత ఇంటర్వ్యూలో నందిని రెడ్డి తన వ్యక్తిగత అభిరుచులు, డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి నాకు ఉంగరాల జుట్టు ఉండేది. జడ వేయించుకునే సమయంలో చాలా నొప్పిగా అనిపించేది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా హెయిర్ కట్ చేయించుకునేదాన్ని. అదే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పారు.
అలాగే చిన్నప్పటి నుంచే షార్ట్స్ ధరించడం అలవాటైందని, తనకు ఎప్పుడూ కంఫర్ట్ చాలా ముఖ్యమని వెల్లడించారు. 20 ఏళ్ల వయసులో చీరలు కూడా కట్టుకున్నాను. కానీ చీరలో నేను సౌకర్యంగా ఫీల్ కాలేదు. ఎంత ఖరీదైన బట్టలు ఇచ్చినా, నాకు కంఫర్ట్‌గా అనిపించినవే ధరిస్తాను అని నందిని పేర్కొన్నారు. ఇక తన పెళ్లి గురించి కూడా నందిని రెడ్డి మనసులోని మాట బయటపెట్టారు. నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని అనుకోలేదు. కాలేజీ రోజుల్లో నేను కూడా ప్రేమలో పడ్డాను. కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన ఆలోచనలు, కెరీర్‌ను అర్థం చేసుకునే వ్యక్తి తనకు దొరకలేదని ఆమె వెల్లడించారు. నాకు పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ అవి నాకు సరైనవిగా అనిపించలేదు. నా కెరీర్‌ను అర్థం చేసుకునే వ్యక్తి దొరకలేదు అని చెప్పారు. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని ఫీల్ కాలేదు. నా పని, నా కుటుంబం, నా స్నేహితులు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. అందుకే పెళ్లి విషయంలో ఎలాంటి ఒత్తిడి కూడా అనిపించలేదు” అని తెలిపారు.